
నేనొస్తున్నా మనవడా!
వడదెబ్బతో మనవడు మృతి చెందడంతో జీర్ణించుకోలేకపోయిన తాత కూడా ప్రాణాలొదిలాడు.
♦ వడదెబ్బతో బాలుడు మృతి
♦ జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన తాత
బొమ్మనహాళ్ : వడదెబ్బతో మనవడు మృతి చెందడంతో జీర్ణించుకోలేకపోయిన తాత కూడా ప్రాణాలొదిలాడు. ఈ హృదయ విదారక సంఘటన బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగన్న(60) బుధవారం తన మనవడు రమేష్ (13)తో కలిసి పొలంలోకి వెళ్లారు. నాలుగు గంటల సమయంలో రమేష్ వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం బళ్లారికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి చేరేలోగానే మృతిచెందాడు. పొలం నుంచి సాయంత్రం ఇంటికి చేరుకున్న గంగన్నకు ఈ వార్త తెలియడంతో గుండెపోటు వచ్చింది. వెంటనే అతన్ని కూడా బళ్లారికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు.