
స్క్రిప్టుకు దర్శకుడు బోయపాటి పూజలు
సఖినేటిపల్లి : అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తన కొత్త చిత్రం స్క్రిప్టుకు పూజలు నిర్వహించారు. స్వామివారి పాదాల చెంత స్క్రిప్టు ఉంచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు, వేదపండితులు బోయపాటికి ఆశీర్వచనం చేశారు. తొలుత ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బోయపాటి వెంట ప్రముఖ వ్యాపారవేత్త లింగోలు సత్య నారాయణ తదితరులు ఉన్నారు.
అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై..
తాజాగా పూజలు నిర్వహించిన ఈ స్క్రిప్టుతో తీసే చిత్రంలో హీరోగా అల్లు అర్జున్ నటిస్తారని, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దీనిని నిర్మిస్తారని బోయపాటి విలేకరులకు తెలిపారు. అర్జున్ స్టైల్‌కి తగ్గట్టుగా, అభిమానులు అర్జున్‌ను ఎలా చూడాలనుకుంటారో, అలాంటి ఎనర్జీ ఉన్న కథతో ఈ స్క్రిప్టు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇది ఎనర్జిటిక్ ప్రేమకథాచిత్రమని, ఇందులో సరికొత్తగా కనిపిస్తారని పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. అయితే స్వరాలను తమన్ సమకూరుస్తారని, సంభాషణలను ఎం.రత్నం అందిస్తారని తెలిపారు. మార్చి నెలాఖరు నుంచి చిత్రం షూటింగ్ జరుగుతుందన్నారు. కాగా బోయపాటితో పలువురు స్థానికులు, భక్తులు ఫొటోలు దిగారు.