
పెళ్లి చేసుకోమంటే నిప్పు పెట్టాడు!
ప్రేమికుడే కాలయముడయ్యాడు. అన్నీ తనే అనుకున్న విద్యార్థిని పట్ల కర్కశత్వం ప్రదర్శించాడు. మనసిచ్చిన పాపానికి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి దారుణానికి ఒడిగట్టాడు. నిలువెల్లా కాలిన గాయాలతో ఆ యువతి తల్లడిల్లుతోంది. చావు బతుకుల మధ్య నరకం అనుభవిస్తోంది. మంగళవారం నల్లగొండలో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలనూ కలచివేసింది.
నల్లగొండ: తలారి అరుణది కనగల్ మండలం కురంపల్లి. జిల్లా కేంద్రం సమీపంలోని నిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. తన రెండో అక్కది అదే మండలంలోని దర్వేశిపురం. తరచూ అక్క వద్దకు వచ్చి వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన సైదులుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రకాశం బజార్‌లోని మాస్ కాంప్లెక్స్‌లో రెండు షట్టర్లు అద్దెకు తీసుకుని సైదులు సొంతంగా ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని అరుణ సైదులును అడుగుతూ వస్తోంది.
ఏదో ఓ కారణం చెప్పి పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం ఫైనాన్స్ కార్యాలయంలోకి అరుణ వెళ్లి పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీసింది. దీంతో అతను కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని క్షతగాత్రురాలి బావకు ఫోన్ చేసి తెలిపాడు. అనంతరం తన స్నేహితుల సహకారంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో తరలించి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అరుణ శరీరం 95శాతం కాలింది. ఆమెకు నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. దాడికి నిరసనగా బుధవారం విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
సైదులుకు గతంలోనే వివాహం
సైదులు గతంలో దర్వేశిపురం మాజీ ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. అతనికి అప్పటికే వివాహం జరిగింది. అతనికి కుమారుడు, కూతురు కూడా ఉన్నారు. తన కుటుంబంతో కలిసి జిల్లాకేంద్రం నుంచి సాగర్‌రోడ్‌లో నివసిస్తున్నాడు. తన తల్లిదండ్రులు స్వగ్రామంలోనే ఉంటున్నారు. తనకు గతంలోనే పెళ్లి అయినందుకు తిరిగి అరుణను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి ఉండవచ్చని భావిస్తున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వనటౌన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ నిందితుడు సైదులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మోసం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
వాంగ్మూలం తీసుకున్న ఏఎస్పీ
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలిని ఏఎస్పీ రమా రాజేశ్వరి, డీఎస్పీ రామ్మోహన్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైదులే కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడని క్షతగాత్రురాలు వారికి వాంగ్మూలం ఇచ్చింది. అనంతరం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుడు ఎక్కడ ఉన్నాడో కొంత సమాచారం అందిందని మీడియాకు ఏఎస్పీ చెప్పారు. క స్టడీలోకి తీసుకోవడానికి పోలీసు బృందాన్ని రంగంలోకి దింపామని వెల్లడించారు. వీలైనంత త్వరలో అతడిని అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
ముందస్తు వ్యూహం?
రెండు నెలల క్రితమే సైదులు షట్టర్లు అద్దెకు తీసుకుని ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించాడు. మంగళవారం ఉదయం షట్టర్లు ఖాళీ చేస్తానని యజమానికి ఫోన్‌లో తెలిపాడు. సైదులే స్వయంగా బైక్‌పై ఆమెను ఫైనాన్స్ కార్యాల యానికి తీసుకొచ్చాడని సమాచారం. సాయంత్రంలోగా ఘటన చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగానే దాడికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో మరికొం దరి పాత్ర ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
నిరుపేద కుటుంబం..
అరుణది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు ఈశ్వరయ్య, పిచ్చమ్మ కూలి చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. వారిలో ఒక్కడే కుమారుడు. అతను కూడా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మిగిలిన ముగ్గురు కూతుళ్లలో అరుణ చిన్నది. మిగతా ఇద్దరు కుమార్తెలు పెద్దగా చదువుకోలేదు. అష్టకష్టాలకోర్చి చిన్న కూతురిని ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. ఈమెకైనా ఉన్నత చదువులు చెప్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేద్దామని తల్లిదండ్రులు ఆశతో ఉన్నారు. జిల్లా కేంద్రంలో గది అద్దెకు తీసుకుని చదివే స్థోమత లేకపోవడంతో నిత్యం ఇంటి నుంచే కళాశాలకు వెళ్లి వచ్చేది. ఇంతలో ఘోరం జరిగిపోవడంతో అమ్మానాన్నలు గుండెలవిసేలా విలపిస్తున్నారు.