కృష్ణా జలాల కేటాయింపులపై తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఏపీ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్‌కు ఆదేశం విచారణ 8 వారాలకు వాయిదా
న్యూఢిల్లీ : కృష్ణా జలాల కేటాయింపుపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయకూడదన్న ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వైఖరేమిటో తెలపాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈమేరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసి, విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. కృష్ణా జలాల కేటాయింపులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ప్రకటించిన అవార్డు తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉందని, దాని అమలు నిలిపివేయాలని కోరుతూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవార్డును కేంద్రం గెజిట్‌లో నోటిఫై చేయకూడదని కూడా ఆదేశించింది. గత ఏడాది నవంబరులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును ప్రకటించింది. ఇందులో కూడా తమకు అన్యాయం జరిగిందని, దీనిని గెజిట్‌లో ప్రచురించకూడదని ఈ ఏడాది జనవరిలో మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును త్వరగా గెజిట్‌లో ప్రచురించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ కేసు బుధవారం జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ, జస్టిస్ ప్రఫుళ్ల చంద్రపంత్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చింది.
ఈ కేసులో ఏదైనా మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయా అని న్యాయమూర్తి జస్టిస్ ముఖోపాధ్యాయ ప్రశ్నించారు. గెజిట్‌లో ప్రచురించకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని , తుది అవార్డు వచ్చినప్పటికీ, నోటిఫై కాలేదని కర్ణాటక న్యాయవాది నారీమన్ వివరించారు. ఈ సమయంలో ఏపీ న్యాయవాది ఎ.కె.గంగూలీ కల్పించుకుని ‘నోటిఫై చేయాలంటూ మహారాష్ట్ర దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం నోటీసులు జారీచేసింది. మేం వేసిన పిటిషన్లపై ఇంకా నోటీసులు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన కారణంగా తిరిగి కేటాయింపులు జరపాల్సి ఉంది’ అని చెప్పారు. దీంతో ఏపీ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు తమకు సమ్మతం కాదని, కొత్తగా కేటాయింపులు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది.
‘బ్రిజేష్ తీర్పు నోటిఫై’ పై మీ వైఖరేమిటి?
Published Thu, Oct 9 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement
Advertisement