brijesh Kumar Tribunal judgment
-
గోదావరి ఎత్తిపోతలే తెలంగాణకు శరణ్యం
ఉమ్మడి రాష్ట్రంలో 1,480 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి అవకాశం వున్నదని 1980 సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ప్రధానంగా ప్రాణహిత నది తుమ్మిడిహెట్టి వద్ద గోదావరిలో కలిసిపోగా కాళేశ్వరం వద్ద శబరి కలుస్తున్నది. ప్రాణహిత కలిసిన దగ్గర నుండి గోదావరిలో నీరు పెరిగి, కాళేశ్వరంకు వచ్చేవరకు పెద్ద ప్రవాహంగా మారుతుంది. సీపీఐ, రైతు సంఘం గత 50 ఏళ్ల నుండి గోదావరి జలాలను వినియోగించుకుంటే తప్ప, తెలంగాణకు వేరే శరణ్యం లేదని అనేక సందర్భాలలో ప్రభుత్వాల దృష్టికి తేవడానికి ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహించాయి. 1990 నుండి రాష్ట్ర వ్యాపితంగా సాగునీటి సాధన ఉద్యమాలు ముమ్మరంగా సాగాయి. 2000 సంవత్సరంలో గోదావరి వాటర్ కమిషన్‌కు తక్షణమే సర్వేలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు కొల్లి నాగేశ్వరరావు ఇందిరాపార్కు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అప్పటి ప్రభుత్వం 100 సంవత్సరాల నీటి వర్షపాతం అనుసరించి ఎక్కడెక్కడ ఎంత నీరుం దనే రిపోర్టు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం వ్యాప్కోస్ సంస్థకు సర్వే బాధ్యత అప్పగించింది. ఆ సంస్థ రిపోర్టు ఆధారంగా జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ 2006లో ఎల్లంపల్లి శ్రీపాద రిజర్వాయర్, 2008లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేపట్టడం ఉద్యమ స్ఫూర్తికి, ప్రజా ఆకాంక్షలకు నిదర్శనం. రిజర్వాయర్ తప్ప మిగతా ప్యాకేజీలు దాదాపు ప్రారంభమయ్యాయి. గోదావరి జలాలు తెలంగాణకు ఉపయోగపడాలంటే ఎత్తిపోతలు తప్ప మార్గం లేదని మొదట చెప్పింది కమ్యూనిస్టుపార్టీ. అయితే ఆనాటి ప్రభుత్వాలు ఎత్తిపోతల ద్వారా బాగా ఖర్చు అవుతున్నదని, చెల్లుబాటు కాదని దాటవేస్తూ వచ్చాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి రిజ ర్వాయర్కు శంకుస్థాపన చేసినప్పుడు హర్షం వ్యక్తమయ్యింది. శ్రీరాంసాగర్ వరద కాలువకు నిధులు బాగా కేటాయించినప్పుడు సంతృప్తినిచ్చింది. తెలంగాణ సాగునీటికి ఎత్తిపోతలు మాత్రమే శరణ్యమని చెప్పిన ప్రముఖ ఇంజనీర్ కీ.శే. శివరామకృష్ణయ్య సలహాలు తీసుకొని తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీరందించేందుకు చర్యలు చేపట్టాలని అనేక విజ్ఞప్తులు చేయడమైనది. దానికి వైఎస్సార్ స్పందించి ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పనకు పూనుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్య మం ఉధృతం కావడంతో 2005 నుండి ప్రభుత్వ పాలన నత్తనడకన కొనసాగింది. ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన నినాదాలతో మారుమ్రోగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఐ ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సీఎం కేసీఆర్‌కి ప్రాణహిత తుమ్మిడిహెట్టి వద్ద రిజర్వాయర్ కట్టి తక్కువ ఎత్తుతో ఎల్లంపల్లి, శ్రీపాదసాగర్ను నింపాలని అలాగే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాకు ఉద్యమిద్దామని వివరించింది. అయినప్పటికి సీఎం నుండి ఎలాంటి స్పందనా రాలేదు. కాళేశ్వరం పక్కనున్న మేడిగడ్డ వద్ద రిజ ర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదన చేసినప్పుడు గోదావరి నదికి అడ్డంగా ఎన్ని బ్యారేజీలు కట్టినప్పటికీ తక్కువేనని చెప్పిన పార్టీ సీపీఐ దానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా మేడిగడ్డ రిజర్వాయర్ వద్ద నుండి కన్నెపల్లి పంపుహౌజ్, అ తదుపరి సుందిళ్ల పంపుహౌజ్, అన్నారం బ్యారేజీ, మేడారం రిజర్వాయర్ లాంటి పనులు ప్రగతిలో ఉండటం మంచి పరిణామమే. దాదాపు లక్ష కోట్లతో బ్యారేజీల నిర్మాణం చేపట్టి కన్నెపల్లి పంపు హౌజ్, సుందిళ్ల పంపుహౌజ్‌లు ముచ్చటగా మూడేండ్లకే ప్రారంభానికి నోచుకోవడం శుభపరిణామం. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. 1,530 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు శరవేగంగా సాగడం మంచి పరిణామమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ విని యోగం దాదాపు 4 వేల 7 వందల మెగావాట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ ప్రాజెక్టు, భారీ అంచనాలతో ప్రారంభమైంది. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించడం లేదు. అయితే నిర్వహణ ఖర్చు తడిసిమోపెడు అయ్యే అవకాశమున్నందున భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుగాకూడదు. దానికి పరిష్కారమార్గాలను అన్వేషించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వంపైన ఉంటుంది. అందుకని ఇంజ నీరింగ్ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో ప్రత్యేక సమావేశం జరిపి శాశ్వత పరిష్కారం, విధివిధానాలు రూపొందించాలి. (సీపీఐ ఆధ్వర్యంలో మేడిగడ్డ, సుందిళ్ల తదితర ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా) వ్యాసకర్త : చాడ వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
‘బ్రిజేష్ తీర్పు నోటిఫై’ పై మీ వైఖరేమిటి?
-
‘బ్రిజేష్ తీర్పు నోటిఫై’ పై మీ వైఖరేమిటి?
కృష్ణా జలాల కేటాయింపులపై తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేంద్రానికి సుప్రీం నోటీసులు ఏపీ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్‌కు ఆదేశం విచారణ 8 వారాలకు వాయిదా న్యూఢిల్లీ : కృష్ణా జలాల కేటాయింపుపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయకూడదన్న ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వైఖరేమిటో తెలపాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈమేరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసి, విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. కృష్ణా జలాల కేటాయింపులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ప్రకటించిన అవార్డు తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉందని, దాని అమలు నిలిపివేయాలని కోరుతూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవార్డును కేంద్రం గెజిట్‌లో నోటిఫై చేయకూడదని కూడా ఆదేశించింది. గత ఏడాది నవంబరులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును ప్రకటించింది. ఇందులో కూడా తమకు అన్యాయం జరిగిందని, దీనిని గెజిట్‌లో ప్రచురించకూడదని ఈ ఏడాది జనవరిలో మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును త్వరగా గెజిట్‌లో ప్రచురించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ కేసు బుధవారం జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ, జస్టిస్ ప్రఫుళ్ల చంద్రపంత్లతో కూడిన ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏదైనా మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయా అని న్యాయమూర్తి జస్టిస్ ముఖోపాధ్యాయ ప్రశ్నించారు. గెజిట్‌లో ప్రచురించకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని , తుది అవార్డు వచ్చినప్పటికీ, నోటిఫై కాలేదని కర్ణాటక న్యాయవాది నారీమన్ వివరించారు. ఈ సమయంలో ఏపీ న్యాయవాది ఎ.కె.గంగూలీ కల్పించుకుని ‘నోటిఫై చేయాలంటూ మహారాష్ట్ర దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం నోటీసులు జారీచేసింది. మేం వేసిన పిటిషన్లపై ఇంకా నోటీసులు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన కారణంగా తిరిగి కేటాయింపులు జరపాల్సి ఉంది’ అని చెప్పారు. దీంతో ఏపీ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు తమకు సమ్మతం కాదని, కొత్తగా కేటాయింపులు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది. -
రాజన్న రాజ్యంలో.. జలయజ్ఞం
బాబు పాలన: బాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కానీ, కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఆ కారణం వల్లనే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. - కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులను అప్పట్లోనే నిర్మించి ఉంటే ట్రిబ్యునల్ తీర్పు మనకు అనుకూలంగా వచ్చేది. - బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన వ్యయం రూ. 700 కోట్లు మాత్రమే. అంటే.. ఏడాదికి వంద కోట్లను కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు. - ఇంకుడుగుంతలపై చూపిన శ్రద్ధ భారీ ప్రాజెక్టులపై చూపలేదు. - ఆనాడు కేంద్రంలో తానే చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... కేంద్రంలో మాట్లాడి ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపలేకపోయారు. మన రాష్ట్ర సాగునీటి హక్కులు కాపాడలేక పోయారు. రాజన్న రాజ్యం అందుబాటులోకి వచ్చిన ప్రతి నీటి బిందువునూ ఒడిసి పట్టుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రాష్ట్ర ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని కలలుగన్న ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన మహాయజ్ఞం... జలయజ్ఞం! దివి నుంచి భువికి గంగను రప్పించే భగీరథయత్నం.. కరవు కాటకాలను తరిమికొట్టడానికి చేపట్టిన వజ్రాయుధం.. కోటి ఎకరాలకు నీరందించి రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు మహానేత తీసుకున్న దృఢసంకల్పం జలయజ్ఞం! - ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించారు వైయస్సార్. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో 86 ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. - జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో ఐదేళ్లలోనే 12 ప్రాజెక్టులను పూర్తిచేశారు. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి, సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. - ఐదేళ్లలోనే రూ. 53 వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. చాలా ప్రాజెక్టులు చివరిదశకు చేరుకున్నాయి. - ఆయన హయాంలో వేగంగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులు తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. డిజైన్‌ను మార్చడం వల్ల మళ్ళీ టెండర్లను ఖరారు చేయానికే ప్రభుత్వం మూడేళ్ళ సమయాన్ని తీసుకుంది. వైఎస్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అదే వేగంతో జరిగినట్టయితే... ఈ సమయానికి పూర్తయి...పశ్చిమ గోదావరి జిల్లాలో 7.2 లక్షల ఆయకట్టుకు నీటి వసతిని కల్పించడంతో పాటు కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించడానికి, విశాఖపట్టణానికి 30 టీఎంసీల నీటి సరఫరాకు అవకాశం ఉండేది. - ఆ ఒక్క ప్రాజెక్టునే కాదు, మహానేత మరణానంతరం ఇతర ప్రాజెక్టులను సైతం పట్టించుకున్న నాధుడే లేడు. జగన్ సంకల్పం పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కూడా తానే తీసుకుంది. పోలవరంతోపాటు పెండింగ్‌లో ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాతిపదికపై నిర్మాణం పూర్తిచేయడం జరుగుతుంది. ప్రాజెక్టుల నిర్మాణ ప్రభావం మైనింగ్, ట్రాన్స్పోర్ట్, మాన్యుఫ్యాక్చరింగ్, వినిమయ రంగాలపై ప్రసరించి, 2004-09 మధ్య విస్తరించిన అభివృద్ధి మాదిరిగానే ఆయా రంగాల పురోగతికి దోహదం చేస్తుంది. సిమెంట్, స్టీల్, నిర్మాణ సామగ్రి... వీటన్నింటి కొనుగోళ్ళూ పెరగటం, మైనింగ్, ట్రాన్స్‌పోర్టు పెరగటం అంటే ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా మళ్ళీ జీవం పోయటమే! -
ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : కృష్ణా డెల్టాకు ముప్పుగా పరిణమించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రైతులు, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా ట్రిబ్యునల్ ముందు కృష్ణా డెల్టా ప్రయోజనాలు కాపాడేలా వాదనలు వినిపించలేకపోయారని విమర్శించారు. నీటిలభ్యత, మిగులు జలాలపై ట్రిబ్యునల్ తీసుకున్న ప్రాతిపదకలు శాస్త్రీయంగా లేవని, ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రతిపాదించ కూడదని డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై రివ్యూ పిటీషన్‌కు అవకాశాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కౌలురైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణా డెల్టా ఆయకట్టుకు తీవ్ర హాని చేసే విధంగా ఉందన్నారు. కాలువ పనుల ఆధునికీకరణను సకాలంలో పూర్తి చేసి కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులను కష్టాలనుంచి గట్టెక్కించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వాస్తవ సాగుదారులకు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకు రైతు సంఘం నాయకులు లింగం కృష్ణారావు, గుండపనేని సురేష్, సత్తిబాబు, కౌలు రైతుల సంఘ నాయకులు గండి రాజా తదితరులు నాయకత్వం వహించారు. -
బ్రిజేశ్‌కుమార్ తీర్పుతో రాష్ట్రం ఎడారే
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రం ఎడారిగా మారనుందని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రిజేశ్ తీర్పుపై ఇటీవల అఖిలపక్ష సభ్యులంతా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి వివరించినట్లు చెప్పారు. ఈ తీర్పు 40 సంవత్సరాల పాటు ఉంటుందని, దీనిని అమలు చేస్తే 40 సంవత్సరాలపాటు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు, జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రుల బృందం నిర్ణయించిన విధానానికి బ్రిజేశ్ తీర్పు విరుద్ధంగా ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలంటూ ఆంక్షలు పెట్టిందని, కానీ మహారాష్ర్ట, కర్ణాటకలో ప్రాజెక్టుల ఎత్తు పెంచుకోవడానికి కూడా అనుమతిచ్చిందని తెలిపారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పుపై రాష్ర్ట ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని కోరారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నూతనంగా నిర్మించుకున్న ప్రాజెక్టుల ప్రస్తావనను బ్రిజేశ్ ట్రిబ్యునల్ తన తీర్పులో తీసుకు రాలేదని చెప్పారు. మిగుల జలాల ఆధారంగా జిల్లాలో 32 వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉంటాయన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీపీటీసీ మాలి పురుషోత్తంరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డబ్బికార్ మల్లేష్, సీపీఎం నాయకులు గట్టికొప్పుల రాంరెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
'వెళ్లను వెళ్లారు...రానూ వచ్చారు'
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్ఆర్ సీపీ నేత వైవీ మైసూరారెడ్డి అన్నారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశమంతా అయోమయంగా ఉందని ఎందుకు వెళ్లారో... ఏం చెప్పారో చెప్పాలన్నారు. రాష్ట్ర హక్కుల్ని కాపాడేందుకు ప్రధాని ముందుకు రాకపోవటం శోచనీయమని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటే సుప్రీం అనే విషయం ప్రధానికి తెలియదా అన్నారు. ప్రధానమంత్రి ఇచ్చే ఉచిత సలహా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లటం అవసరమా అని మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సమైక్యమన్న పార్టీలను మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తే బాగుండేదని మైసూరారెడ్డి అన్నారు. విభజనకు అనుకూలంగా ఉండే పార్టీలకు వేదిక కల్పించేందుకు ఆయన యత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన కోరుకునే పార్టీలతో తాము వేదిక పంచుకోవటం అర్థం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరి ఏమైనా మారిందా అని అశోక్ బాబు ప్రశ్నించారు. -
వాళ్లకు నీళ్లు... మనకు బీళ్లు
రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఆంధ్ర, తెలంగాణల మధ్య కృష్ణా జలాల సమస్య పరిష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. కృష్ణ మిగులు జలాలను సంపూర్ణంగా విని యోగించుకునే స్వేచ్ఛను హరించి, కరవు పీడిత ప్రాంత ప్రజల ఆశలను ఆవిరి చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగుజాతి పాలిట అశనిపాతమే. సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా నదిపై 1852-56 మధ్య విజయవాడ వద్ద ఆనకట్టను నిర్మించడం ద్వారా డెల్టా, గుంటూరు కాలువల లోను, కృష్ణ ఉపనది తుంగభద్రపై 1861-72 మధ్య కాలంలో సుంకేసుల ఆనకట్టతో కర్నూ లు- కడప కాలువలోను నీరు పారించాడు. నాగా ర్జునసాగర్ ప్రాజెక్టుకు 1955లోను, తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ రెండవదశకు 1956లోను ప్రాణం పోశారు. ఇదే జరగకుంటే నేడు తెలుగుజాతి దుస్థితి ఎలా ఉండేదో ఊహించలేం! భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని 1960లో జరిగిన అంతర్రాష్ట్ర మహా సభ చర్చించింది. 1951కి ముందు నిర్మితమై నీటిని వినియోగించుకొంటున్న, 1950 నాటికి ప్రణాళికా సంఘం ఆమోదంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి రక్షణ కల్పించాలని ఆ సభ ఆమోదించింది. ఆ నిర్ణ యమే రక్షాకవచమై కృష్ణా నదిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా లభి స్తున్న 2060 టీఎంసీలలో మన రాష్ట్ర వాటా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 800 టీఎంసీలు సురక్షితంగా ఉన్నాయి. బ్రిజేశ్ తీర్పు అలా పరిణమించడానికి మూల కారణం మన రాజకీయ వ్యవస్థ వైఫల్యమే. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఈ అవకాశాన్ని ఉప యోగించుకొని కృష్ణా జలాల పునః పంపకం తాము కోరుకొన్న రీతిలో ఉం డేటట్టు బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో సాధ్యం చేసుకున్నాయి. అర్థ దశాబ్దంగా ప్రజల జీవన్మరణ సమస్యలను పట్టించుకునే తీరిక మన ప్రభుత్వానికి మాత్రం లేదు. అసలు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉన్నప్పటి నుంచే కర్ణాటక, మహారాష్ట్రలు మిగులు జలాలపై కన్నేసి, రాయలసీమలో, మహబూబ్‌నగర్, నల్లగొండ (తెలంగాణ), ప్రకాశం (కోస్తా) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లపై అభ్యంతరాలు లేవదీస్తూనే ఉన్నాయి. 2000 మే 31న ట్రిబ్యునల్ గడువు ముగియగానే అవి ఈ సమస్యపై వివాదాన్ని రేపి, అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయో గించి విజయం సాధించాయి. మనకి మాత్రం జలయజ్ఞంలో భాగంగా ఇప్పటికే 30 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిన తెలుగు-గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాలు వ, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇరుగు-పొరుగుకు అనుకూలంగా... నీటి లభ్యతను నిర్థారించడానికి బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎంచుకొన్న ప్రమాణం అసంబద్ధమైనది. కర్ణాటక, మహారాష్ట్రల కోర్కెలకు అనుగుణంగా నీటిని కేటా యించడానికే కొలమానాలను ఎంచుకున్నట్టు భావించేటట్టుగా ఉంది. మూడు రాష్ట్రాల జలాశయాలలో స్థూలంగా 1919 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న దని, 1518 టీఎంసీల (మహారాష్ట్ర+కర్ణాటక+ఆంధ్రప్రదేశ్ః 483.24+479.35+ 555.84= 1618.43) మేరకు సజీవ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని, గరిష్టంగా 2313 టీఎంసీ (మహారాష్ట్రలో 551.65 టీఎంసీలు, కర్ణాటకలో 695.97 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌లో 1065.44 టీఎంసీల) నీటిని వినియోగించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేసింది. తదనుగుణంగా 65 శాతం విశ్వసనీయత ఆధారంగా 2293 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించి, పం దారం చేసింది. 1518.43 టీఎంసీలలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయా లలో ‘క్వారీ ఓవర్’ నిల్వకు అనుమతించిన 150 టీఎంసీలను మినహాయిస్తే 1368.43 టీఎంసీ సజీవ నిల్వ సామర్థ్యంతో, నీటి నిల్వ - వినియోగ నిష్పత్తి 1:1.40గా ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొన్నది. నిర్మాణం పూర్తి కాని పులిచిం తల జలాశయం నిల్వను కూడా లెక్కించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాల్లో పూడిక వల్ల తగ్గిపోయిన నీటి నిల్వను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే ప్రకాశం ఆనకట్ట వద్ద నుంచి అనివార్యంగా సముద్రం పాలవుతున్న నీటిని లెక్కలోకి తీసుకోలేదు. హేతుబద్ధం కాని కొలమానాలు బచావత్ ట్రిబ్యునల్ 1894-95 నుంచి 1971-72 వరకు అందుబాటులో ఉన్న 78 సంవత్సరాల నదీ ప్రవాహ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని 75 శాతం ప్రామాణికంగా 2060 టీఎంసీ నికర జలాలు, 70 టీఎంసీల పునరుత్పత్తి నీళ్లు లభిస్తాయని నిర్ధారించింది. ఆ మేరకు మహారాష్ర్టకు 585 (560 నికర జలాలు+ 25 పునరుత్పత్తి జలాలు) టీఎంసీలు, కర్ణాటకకు 734 (700+34) టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811 (800+11) టీఎంసీలు కేటాయించింది. కానీ 112 ఏళ్ల నదీ ప్రవాహ గణాంకాలు ఉన్నప్పటికీ 1961-62 మొదలు 2007-08 వరకు 47 ఏళ్ల నదీ ప్రవాహ గణాంకాలను మాత్రమే బ్రిజేశ్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొని 65 శాతం విశ్వసనీయత ఆధారంగా నికర జలాలు 2293 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించింది. అలాగే 75 శాతం విశ్వసనీ యతపై 2173 టీఎంసీలు లభిస్తాయని, బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నికర జలాలు 2060+70 పునరుత్పత్తి నీరు కలిపితే 2130 టీఎంసీలకు ఇవి సరిస మానంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టే, బచావత్ ట్రిబ్యునల్ చేసిన నికర జలాల కేటాయింపును యథాతథంగా కొనసాగిస్తూ, మిగిలిన 163 (2293- 2130) టీఎంసీలను మూ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయించింది. గంగలో కలిసిన జాతీయ విధానం నదీ జలాలను మొదట త్రాగు నీటికి, తరువాత వ్యవసాయానికి, అటుపై విద్యు దుత్పాదనకు కేటాయించాలని జాతీయ నదీ జలాల విధానం పేర్కొన్నది. కానీ తద్భిన్నంగా ముంబై, దాని పరిసర ప్రాంతాల విద్యుత్ అవసరాల దృష్ట్యా కోయినా జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న 67.5 టీఎంసీలతో పాటు మరో 25 టీఎంసీలను, సాగునీటి ప్రాజెక్టులకు 18 టీఎంసీలు, మొత్తం 43 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించింది. కర్ణాటకకు 65 టీఎంసీలను వివిధ సాగు నీటి పథకాలకు కేటాయించింది. అక్కడితో ఆగకుండా వార్షిక సగటు నీటి లభ్యత 2578 టీఎంసీలుగా నిర్ధారించి, 65 శాతం విశ్వసనీయతపై పేర్కొన్న 2293 టీఎంసీలు పోను 285 టీఎంసీలు మిగులు జలాలు లభిస్తాయని, వాటిలో మహారాష్ట్రకు 35 టీఎంసీ, కర్ణాటకకు 105 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయించడం ద్వారా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు పొంది ప్రాజెక్టులను నిర్మిం చుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. పెపైచ్చు మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇక మీదట నికర లేదా మిగులు జలాలన్న వివక్ష ఉండదని సెలవిచ్చింది. ఇది చాలా ప్రమా దకరమైనది. మొత్తంగా మహా రాష్ట్రకు 666 (585+4+35+3) టీఎంసీలు, కర్ణాటకకు 911 (734+65+105+7) టీఎంసీల కేటాయింపు జరిగింది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మిస్తే ఇహ మన రాష్ట్రానికి నీళ్లు వచ్చే అవకాశాలు మృగ్యం. వాదనలు పట్టని ట్రిబ్యునల్ మన రాష్ట్రం పట్ల ట్రిబ్యునల్ దుర్మార్గంగా వ్యవహరించింది. 65 శాతం విశ్వసనీ యత పద్దు కింద 43 టీఎంసీలను కేటాయించినట్లు పేర్కొంటూనే, కనికట్టు మాయాజాలం చేసింది. ఒక్క జూరాలకు మాత్రమే నిజాయితీగా 9 టీఎంసీ లను కేటాయించింది. మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టులకు నీటిని కేటాయించమని కోరితే పట్టించుకోకుండా ముసాయిదా తీర్పులో పొందుపరచిన రాజోలిబండ మళ్లింపు పథకం కుడి కాలువకు 4 టీఎంసీలను మంజూరు చేసి, వివాదానికి ఆజ్యం పోసింది. దారుణమైన అంశం ఏమిటంటే 65 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన 30 టీఎంసీలను కరవు పీడిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న పథకాలకు కేటాయిం చకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ పద్దు కింద జమ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ 150 టీఎంసీల మిగులు జలాలను క్యారీ ఓవర్ నిమిత్తం నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల్లో మన రాష్ట్రానికి 145 టీఎంసీలను మంజూరు చేసి, అందులో 120 టీఎంసీలను, వాటికి తోడు 65 విశ్వసనీయత ఉన్న 30 టీఎంసీలను వెరసి 150 టీఎంసీలను క్యారీ ఓవర్ నిల్వ కోసం కేటాయించింది. మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగకు మాత్రం వస్తాయో, రావో తెలియని మిగులు జలాల నుంచి 25 టీఎంసీలను కేటాయించింది. పైగా ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ లభిస్తేనే ఇది వర్తిస్తుందని షరతు విధించింది. ఇది రాయలసీమను దగా చేయడమే. గడచిన అనుభవం ఆధారంగా నికర జలాల వినియోగంలో మహారాష్ర్టకు 99 శాతం, కర్ణాటకకు 97 శాతం సఫలీ కృత నిష్పత్తి (సక్సెస్ రేటు) ఉన్నదని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 68 శాతం ఉన్నదని మొరపెట్టుకున్నా ట్రిబ్యునల్ చెవికెక్కలేదు. కరవు ప్రాంతాలపై వివక్ష ఏల? కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్రలో 50,242 చదరపు కిలోమీ టర్లు, కర్ణాటకలో 52,375 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 45,493 చదరపు కిలోమీటర్ల మేరకు కరువు పీడిత ప్రాంతాలు ఉన్నట్లు డీపీఏపీ గణాం కాలను బట్టి స్పష్టమవుతున్నదని ట్రిబ్యునల్ గుర్తిస్తూనే, 65 శాతం విశ్వనీయత ఆధారంగా లభిస్తాయని అంచనా వేసిన 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 టీఎంసీలు, మొత్తం 448 టీఎంసీల నీటిని పంపిణీ చేసేటప్పుడు మాత్రం మన రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు ట్రిబ్యునల్ మొండి చేయి చూపెట్టింది. మరొక వైపున రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదిం చిన ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జల వివాదాల పరిష్కారానికి మరొక జలమండలిని కేంద్ర జలవనరుల శాఖమంత్రి నేతృ త్వంలో నెలకొల్పాలని సిఫార్సు చేసింది. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఆంధ్ర, తెలంగాణల మధ్య కృష్ణా జలాల సమస్య పరి ష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. -
'సీఎం ఎందుకు భయపడుతున్నారు?'
న్యూఢిల్లీ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చేసిన వాదనలకు, ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పుకు విరుద్ధమైన భావాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే చర్చ జరపాలని నారాయణ డిమాండ్ చేశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చించటానికి అయిదురోజులు సరిపోతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పంపిన బిల్లును తిరస్కరించటం మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. -
మరోసారి అఖిలపక్షం నిర్వహించిన తర్వాత తుదినిర్ణయం : సిఎం
హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత తుదినిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఈ రోజు సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్టీలు చెప్పిన అభిప్రాయాలపై న్యాయ నిపుణులను సంప్రదిస్తామని సీఎం చెప్పారు. సమావేశానికి అన్నిపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నుంచి కొణతాల రామకృష్ణ, శోభానాగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోదండ రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ తరపున నారాయణ, గుండా మల్లేష్, సీపీఎం నుంచి బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, టీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్ రావు, వినోద్ కుమార్, బీజేపీ నుండి నాగం జనార్థన్ రెడ్డి, శేషగిరిరావు, లోక్‌సత్తా పార్టీ తరపున జయప్రకాష్ నారాయణ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా హాజరయ్యారు. -
ఆకలి చావులు తప్పవేమో!
బ్రిజేశ్ తీర్పుపై రైతు సంఘాల అఖిలపక్ష సమావేశం ఆందోళన సుప్రీంను ఆశ్రయించాలని కోరుతూ తీర్మానం 3న 12 జిల్లాల్లో రాస్తారోకోలకు పిలుపు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో ఆకలిచావులు తప్పవేమోనని రైతు సంఘాల అఖిలపక్ష సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏకపక్ష తీర్పును అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించాలని డిమాండ్ చేసింది. తీర్పును సమీక్షించేలా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. అవసరమైతే రాష్ట్ర బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.‘రాష్ట్ర రైతాంగంపై తీర్పు ప్రభావం- కర్తవ్యం’ పేరిట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదివారమిక్కడ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో నష్టపోయే 12 జిల్లాల్లో 3న రాస్తారోకోలు చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిజేశ్ తీర్పు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ నష్టమేనని వక్తలు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల కిందట రాష్ట్రం లేవనెత్తిన 14 సవరణలను బుట్టదాఖలు చేయడంతో పాటు ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం రాష్ట్ర రైతులకు తీరని అన్యాయమన్నారు. బ్రిజేశ్ తీర్పు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైందని విమర్శించారు. దీంతో మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశంతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలు కరువుబారిన పడే అవకాశం ఉందని, పాలకులు మొద్దు నిద్ర పోవడమే దీనికి కారణమని ఆరోపించారు. ఎగువ రాష్ట్రాలు తమ వాటా నికర, మిగులు జలాలు వాడుకున్న తర్వాతే దిగువ రాష్ట్రం వాడుకునే దుస్థితి వల్ల నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల కింద ఉన్న ఆయకట్టు నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు వల్ల జరిగే అనర్థాలను వివరించేందుకు సోమవారం ముఖ్యమంత్రిని కలవాలని సమావేశం తీర్మానించింది. కె.రామకృష్ణ, రావుల వెంకయ్య (రైతు సంఘం), చంద్రారెడ్డి (సీపీఎం అనుబంధ రైతు సంఘం), నల్లమల వెంకటేశ్వరరావు (తెలుగురైతు), ఎర్నేని నాగేంద్రనాథ్ (రైతు సంఘాల సమాఖ్య), గాదె దివాకర్ (న్యూడెమోక్రసీ రైతు సంఘం), భాస్కరరావు (లోక్‌సత్తా), కేఆర్ చౌదరి, కొల్లి నాగేశ్వరరావు (ఏఐకెఎస్), మండే వీర హనుమంతరావు (కౌలు రైతుల సంఘం) యులవుందరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.