'వెళ్లను వెళ్లారు...రానూ వచ్చారు'
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్ఆర్ సీపీ నేత వైవీ మైసూరారెడ్డి అన్నారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశమంతా అయోమయంగా ఉందని ఎందుకు వెళ్లారో... ఏం చెప్పారో చెప్పాలన్నారు.
రాష్ట్ర హక్కుల్ని కాపాడేందుకు ప్రధాని ముందుకు రాకపోవటం శోచనీయమని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటే సుప్రీం అనే విషయం ప్రధానికి తెలియదా అన్నారు. ప్రధానమంత్రి ఇచ్చే ఉచిత సలహా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లటం అవసరమా అని మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సమైక్యమన్న పార్టీలను మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తే బాగుండేదని మైసూరారెడ్డి అన్నారు. విభజనకు అనుకూలంగా ఉండే పార్టీలకు వేదిక కల్పించేందుకు ఆయన యత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన కోరుకునే పార్టీలతో తాము వేదిక పంచుకోవటం అర్థం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరి ఏమైనా మారిందా అని అశోక్ బాబు ప్రశ్నించారు.