
ఆకలి చావులు తప్పవేమో!
- బ్రిజేశ్ తీర్పుపై రైతు సంఘాల అఖిలపక్ష సమావేశం ఆందోళన
- సుప్రీంను ఆశ్రయించాలని కోరుతూ తీర్మానం
- 3న 12 జిల్లాల్లో రాస్తారోకోలకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో ఆకలిచావులు తప్పవేమోనని రైతు సంఘాల అఖిలపక్ష సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏకపక్ష తీర్పును అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించాలని డిమాండ్ చేసింది. తీర్పును సమీక్షించేలా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. అవసరమైతే రాష్ట్ర బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.‘రాష్ట్ర రైతాంగంపై తీర్పు ప్రభావం- కర్తవ్యం’ పేరిట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదివారమిక్కడ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో నష్టపోయే 12 జిల్లాల్లో 3న రాస్తారోకోలు చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిజేశ్ తీర్పు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ నష్టమేనని వక్తలు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల కిందట రాష్ట్రం లేవనెత్తిన 14 సవరణలను బుట్టదాఖలు చేయడంతో పాటు ఆల్‌మట్టి డ్యాం ఎత్తును పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం రాష్ట్ర రైతులకు తీరని అన్యాయమన్నారు. బ్రిజేశ్ తీర్పు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైందని విమర్శించారు. దీంతో మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశంతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలు కరువుబారిన పడే అవకాశం ఉందని, పాలకులు మొద్దు నిద్ర పోవడమే దీనికి కారణమని ఆరోపించారు.
ఎగువ రాష్ట్రాలు తమ వాటా నికర, మిగులు జలాలు వాడుకున్న తర్వాతే దిగువ రాష్ట్రం వాడుకునే దుస్థితి వల్ల నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల కింద ఉన్న ఆయకట్టు నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు వల్ల జరిగే అనర్థాలను వివరించేందుకు సోమవారం ముఖ్యమంత్రిని కలవాలని సమావేశం తీర్మానించింది. కె.రామకృష్ణ, రావుల వెంకయ్య (రైతు సంఘం), చంద్రారెడ్డి (సీపీఎం అనుబంధ రైతు సంఘం), నల్లమల వెంకటేశ్వరరావు (తెలుగురైతు), ఎర్నేని నాగేంద్రనాథ్ (రైతు సంఘాల సమాఖ్య), గాదె దివాకర్ (న్యూడెమోక్రసీ రైతు సంఘం), భాస్కరరావు (లోక్‌సత్తా), కేఆర్ చౌదరి, కొల్లి నాగేశ్వరరావు (ఏఐకెఎస్), మండే వీర హనుమంతరావు (కౌలు రైతుల సంఘం) యులవుందరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.