గోదావరి ఎత్తిపోతలే తెలంగాణకు శరణ్యం | Chada Venkat Reddy Article On Godavari Water Utilization | Sakshi
Sakshi News home page

గోదావరి ఎత్తిపోతలే తెలంగాణకు శరణ్యం

Published Wed, Jun 26 2019 6:42 AM | Last Updated on Wed, Jun 26 2019 6:42 AM

Chada Venkat Reddy Article On Godavari Water Utilization - Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో 1,480 టీఎంసీల నీళ్లు  వాడుకోవడానికి అవకాశం వున్నదని 1980 సంవత్సరంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. ప్రధానంగా ప్రాణహిత నది తుమ్మిడిహెట్టి వద్ద గోదావరిలో కలిసిపోగా కాళేశ్వరం వద్ద శబరి కలుస్తున్నది. ప్రాణహిత  కలిసిన దగ్గర నుండి గోదావరిలో నీరు పెరిగి, కాళేశ్వరంకు వచ్చేవరకు పెద్ద ప్రవాహంగా మారుతుంది. సీపీఐ, రైతు సంఘం గత 50 ఏళ్ల నుండి గోదావరి జలాలను వినియోగించుకుంటే తప్ప, తెలంగాణకు వేరే శరణ్యం లేదని అనేక సందర్భాలలో ప్రభుత్వాల దృష్టికి తేవడానికి ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహించాయి. 1990 నుండి రాష్ట్ర వ్యాపితంగా సాగునీటి సాధన ఉద్యమాలు ముమ్మరంగా సాగాయి. 

2000 సంవత్సరంలో గోదావరి వాటర్‌ కమిషన్‌కు తక్షణమే సర్వేలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు కొల్లి నాగేశ్వరరావు ఇందిరాపార్కు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అప్పటి ప్రభుత్వం 100 సంవత్సరాల నీటి వర్షపాతం అనుసరించి ఎక్కడెక్కడ ఎంత నీరుం దనే రిపోర్టు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం వ్యాప్కోస్‌  సంస్థకు సర్వే బాధ్యత అప్పగించింది. ఆ సంస్థ రిపోర్టు ఆధారంగా జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్‌ 2006లో ఎల్లంపల్లి శ్రీపాద రిజర్వాయర్, 2008లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేపట్టడం ఉద్యమ స్ఫూర్తికి, ప్రజా ఆకాంక్షలకు నిదర్శనం. రిజర్వాయర్‌ తప్ప మిగతా ప్యాకేజీలు దాదాపు ప్రారంభమయ్యాయి. గోదావరి జలాలు తెలంగాణకు ఉపయోగపడాలంటే ఎత్తిపోతలు తప్ప మార్గం లేదని మొదట చెప్పింది కమ్యూనిస్టుపార్టీ. 

అయితే ఆనాటి ప్రభుత్వాలు ఎత్తిపోతల ద్వారా బాగా ఖర్చు అవుతున్నదని, చెల్లుబాటు కాదని దాటవేస్తూ వచ్చాయి. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి రిజ ర్వాయర్‌కు శంకుస్థాపన చేసినప్పుడు హర్షం వ్యక్తమయ్యింది. శ్రీరాంసాగర్‌ వరద కాలువకు నిధులు బాగా కేటాయించినప్పుడు సంతృప్తినిచ్చింది. తెలంగాణ సాగునీటికి ఎత్తిపోతలు మాత్రమే శరణ్యమని చెప్పిన ప్రముఖ ఇంజనీర్‌ కీ.శే. శివరామకృష్ణయ్య సలహాలు తీసుకొని తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీరందించేందుకు చర్యలు చేపట్టాలని అనేక విజ్ఞప్తులు చేయడమైనది. దానికి వైఎస్సార్‌ స్పందించి ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పనకు పూనుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్య మం ఉధృతం కావడంతో 2005 నుండి ప్రభుత్వ పాలన నత్తనడకన కొనసాగింది.

ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన నినాదాలతో మారుమ్రోగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఐ ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సీఎం కేసీఆర్‌కి ప్రాణహిత తుమ్మిడిహెట్టి వద్ద రిజర్వాయర్‌ కట్టి తక్కువ ఎత్తుతో ఎల్లంపల్లి, శ్రీపాదసాగర్‌ను నింపాలని అలాగే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాకు ఉద్యమిద్దామని వివరించింది. అయినప్పటికి సీఎం నుండి ఎలాంటి స్పందనా రాలేదు. కాళేశ్వరం పక్కనున్న మేడిగడ్డ వద్ద రిజ ర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదన చేసినప్పుడు గోదావరి నదికి అడ్డంగా ఎన్ని బ్యారేజీలు కట్టినప్పటికీ తక్కువేనని చెప్పిన పార్టీ సీపీఐ దానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా మేడిగడ్డ రిజర్వాయర్‌ వద్ద నుండి కన్నెపల్లి పంపుహౌజ్, అ తదుపరి సుందిళ్ల పంపుహౌజ్, అన్నారం బ్యారేజీ, మేడారం రిజర్వాయర్‌ లాంటి పనులు ప్రగతిలో ఉండటం మంచి పరిణామమే. దాదాపు లక్ష కోట్లతో బ్యారేజీల నిర్మాణం చేపట్టి కన్నెపల్లి పంపు హౌజ్, సుందిళ్ల పంపుహౌజ్‌లు ముచ్చటగా మూడేండ్లకే ప్రారంభానికి నోచుకోవడం శుభపరిణామం.

కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. 1,530 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు శరవేగంగా సాగడం మంచి పరిణామమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్‌ విని యోగం దాదాపు 4 వేల 7 వందల మెగావాట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ ప్రాజెక్టు, భారీ అంచనాలతో ప్రారంభమైంది. కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించడం లేదు. అయితే నిర్వహణ ఖర్చు తడిసిమోపెడు అయ్యే అవకాశమున్నందున భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుగాకూడదు. దానికి పరిష్కారమార్గాలను అన్వేషించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వంపైన ఉంటుంది. అందుకని ఇంజ నీరింగ్‌ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో ప్రత్యేక సమావేశం జరిపి శాశ్వత పరిష్కారం, విధివిధానాలు రూపొందించాలి.
(సీపీఐ ఆధ్వర్యంలో మేడిగడ్డ, సుందిళ్ల తదితర ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా)


వ్యాసకర్త : చాడ వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement