మిర్యాలగూడ, న్యూస్‌లైన్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రం ఎడారిగా మారనుందని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రిజేశ్ తీర్పుపై ఇటీవల అఖిలపక్ష సభ్యులంతా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి వివరించినట్లు చెప్పారు. ఈ తీర్పు 40 సంవత్సరాల పాటు ఉంటుందని, దీనిని అమలు చేస్తే 40 సంవత్సరాలపాటు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు, జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రుల బృందం నిర్ణయించిన విధానానికి బ్రిజేశ్ తీర్పు విరుద్ధంగా ఉందన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలంటూ ఆంక్షలు పెట్టిందని, కానీ మహారాష్ర్ట, కర్ణాటకలో ప్రాజెక్టుల ఎత్తు పెంచుకోవడానికి కూడా అనుమతిచ్చిందని తెలిపారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పుపై రాష్ర్ట ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని కోరారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నూతనంగా నిర్మించుకున్న ప్రాజెక్టుల ప్రస్తావనను బ్రిజేశ్ ట్రిబ్యునల్ తన తీర్పులో తీసుకు రాలేదని చెప్పారు. మిగుల జలాల ఆధారంగా జిల్లాలో 32 వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉంటాయన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీపీటీసీ మాలి పురుషోత్తంరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డబ్బికార్ మల్లేష్, సీపీఎం నాయకులు గట్టికొప్పుల రాంరెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బ్రిజేశ్‌కుమార్ తీర్పుతో రాష్ట్రం ఎడారే
Published Mon, Dec 23 2013 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement