మూడన్నారు... ఒక్కటీ లేదు ! | Budget 2015 | Sakshi
Sakshi News home page

మూడన్నారు... ఒక్కటీ లేదు !

Published Sun, Mar 1 2015 1:57 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Budget 2015

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాజకీయవర్గాలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రవిభజన సమయంలో చేసిన హామీల అమలుపై చిత్తశుద్ధి చూపకపోవడం...వెనుకబడిన ప్రాంతమని తెలిసి...అభివృద్ధి కోసం దన్నుగా నిలవకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 జిల్లాలో సెంట్రల్ యూనివర్శిటీ, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మూడింటిలో ఒక్క హామీని కూడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. దీనికి తోడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని,  మహిళా, స్త్రీ శిశుసంక్షేమశాఖకు నిధులు  కేటాయింపుల్లో కోత వేయడం కూడా సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ  బడ్జెట్‌పై దాదాపు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  బడ్జెట్‌పై ప్రముఖుల స్పందన...
 
 ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆశించిన నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు నిరాశే మిగిలింది. నిన్న రైల్వే బడ్జెట్‌లో పూర్తిగా అన్యాయం జరిగింది. నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో నిరాశే మిగిలింది. ఆర్భాట ప్రచారాలతో హోరెత్తించిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు కేటాయించడంలో మొండి చేయి చూపింది. దీనిపై రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.    
 -అనంతపురం అర్బన్
 
 బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం
 ఇది ఏమాత్రం పేదలకు ఉపయోగపడే బడ్టెట్ కాదు.. ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటాలు చేసిన ప్రధానమంత్రి మోదీ ఎన్నికల తరువాత అదే ప్రచార ఆర్భాటాలతో హోరెత్తిస్తున్నారు. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ కల్పించడంలో కేంద్రం విఫలమైంది. పోలవరం, ప్రత్యేక ప్యాకే జీపై ఉసే లేదు. బడ్జెట్‌లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసి మొండి చేయి చూపింది. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లో కూడా అలాగే చేయడం బాధకరం. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కావడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
 -ఎం.శంకర్‌నారాయణ,
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
 
 రాయలసీమకు తీవ్ర అన్యాయం
 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్  ప్రజలను చులకనగా చూస్తోంది. బడ్జెట్ కేటాయింపులు దీనినే సూచిస్తోంది. ప్రధానంగా రాయలసీమకి తీవ్ర అన్యాయం జరిగింది. విభజన హామీలన్నింటినీ తుంగలో తొక్కారు. వెనుబడిన రాయలసీమ ప్రయోజనాన్ని చేకూర్చే ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది.  కేంద్ర విద్యా సంస్థలను కూడా అరకొర కేటాయింపులు చేసి వివక్ష చూపారు. ఇరిగేషన్ నిధులకు భారీగా కొత పెట్టారు. టీడీపీ మెతకవైఖరి మాని, కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలి. కార్పొరేట్ సంస్థలకు ట్యాక్స్‌లు తగ్గించి, సాధారణ ప్రజలకు ఇవ్వాల్సిన సబ్సిడీలపై మాత్రం దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిజ స్వరూపం ఏమిటో బయటపడింది.          
 -గేయానంద్, ఎమ్మెల్సీ
 
 బడ్జెట్ ఆశాజనకంగా ఉంది
 ఎంతో అనుభవమున్న మంత్రుల బృందం ఉండడంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ఆశాజనకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లు సామాన్యులకు అండగా నిలుస్తున్నాయి.  మేక్ ఇన్ ఇండియా, జన్‌పథ్, స్వచ్ఛభారత్ లాంటి పథకాల ద్వారా నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మహిళలు, చిన్నారుల అభివృద్ధిని కాంక్షించే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది.  ఏది ఏమైనా దేశ ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టేలా బడ్జెట్ సాగడం ఆహ్వానించదగిన విషయం.
 -అంకాళ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement