
ఆ గేదె.. దొంగని పట్టించింది
నిద్రిస్తున్న మహిళ నుంచి నగలు లాక్కుని పారిపోతుండగా అక్కడే ఉన్న గేదె పొడవటంతో గాయాలపాలై ఓ దొంగ దొరికాడు.
కొండాపురం (నెల్లూరు జిల్లా): నిద్రిస్తున్న మహిళ నుంచి నగలు లాక్కుని పారిపోతుండగా అక్కడే ఉన్న గేదె పొడవటంతో గాయాలపాలై ఓ దొంగ దొరికాడు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. మండలంలోని మన్నెంవారిపల్లె గ్రామానికి చెందిన మేడేపల్లి విజయమ్మ, ఆమె కుమార్తె దొరసానమ్మ, కొడుకు హజరత్ ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చి విజయమ్మ మెడలోని నాలుగున్నర సవర్ల బంగారం గొలుసును, చెవి కమ్మలను లాక్కున్నారు.
తల్లి, కూతురు గట్టిగా కేకలు వేయటంతో దుండగులు పరుగు అందుకున్నారు. వారిలో ఒకరిని ఇంటి ఆవరణలో కట్టేసిన గేదె పొడవటంతో పక్కనే బండలపై పడి గాయపడ్డాడు. అప్రమత్తమై చుట్టుపక్కల వారు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వాళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆ దొంగని పట్టుకుని చితకబాదారు. అతని దాడిలో విజయమ్మ కూడా గాయపడింది. క్షతగాత్రులను కావలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.