సాక్షి, హైదరాబాద్/ అమరావతి: ఐటీగ్రిడ్స్ స్కాంపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన పౌరుల సమాచారం ప్రైవేటు సంస్థలకు ఏ విధంగా వెళ్లిందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకు ఎలా వెళ్లిందన్నారు. ఈ సమాచారం అంతా ప్రగతి కోసం అని మంత్రి లోకేష్ అంటున్నారనీ, వైఎస్సార్‌సీపీకి చెందిన వారి ఓట్ల తొలగింపు కూడా వీరి కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. సర్వేల పేరుతో ఓటర్ల సమాచారం సేకరించారని తెలిపారు. ఓటర్లను నాలుగు భాగాలుగా విభజించి ఓట్ల తొలగింపు చేపట్టారని, ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేని వారి ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!)
సమావేశంలో బుగ్గన మాట్లాడుతూ.. ‘‘గతంలో ప్రభుత్వ టీచర్లు ఓటర్ నమోదు, తొలగింపు చేసేవారు. కాని ప్రస్తుతం అంగన్‌వాడిల ద్వారా చేయిస్తున్నారు. వాళ్లు జన్మభూమి కమిటీ సభ్యుల ఒత్తిడికి లొంగి పనిచేస్తుంటారు. రాష్ట్ర ప్రజల సమాచారాన్ని డేటాహబ్‌లో పెట్టారు. చట్ట ప్రకారం ఎక్కడ నేరం జరిగితే అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కానీ మీరు మాత్రం హైదరాబాద్‌లో నేరం జరిగినా ఏపీలోనే దర్యాప్తు చేస్తానంటారు. ఓటర్ల లిస్ట్ నుంచి మీకు నచ్చని ఓటర్లను తొలగించేందుకు యంత్రాంగం తయారు చేశారు. విచారణ జరుపుతుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ నేతలు ప్రైవేటు సంస్థలకు అమ్ముకుంటున్నారు. బ్లూప్రాగ్ ,ఐటీగ్రిడ్ సంస్దలకు ఈ సమాచారం ఇచ్చారు. (చంద్రబాబుకు భయమెందుకు: కేటీఆర్)
30 కోట్ల రూపాయలకు పంటలకు సంబంధించి ఓ కాంట్రాక్టు ఆ సంస్థకు ఇచ్చారు. 2014 ముందు ఐటీగ్రిడ్ ఎప్పుడైనా వ్యాపారం చేయ్యలేదు. మీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైనా కంపెనీ. మీ కోసమే ఇది ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. డేటా చోరీ విషయం బయటకు రాగానే యాప్ నుంచి డేటా ఎందుకు తీసేశారు. సేవామిత్ర యాప్ డౌన్ లోడ్ చేస్కున్న ప్రతి ఒక్కరి డేటా ఐటీగ్రిడ్స్ వద్ద ఉంది. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్స్ ఐటీగ్రిడ్స్ వద్ద ఉన్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది. బ్యాంక్ అకౌంట్ల పాస్‌వార్డ్స్ మార్చుకోండి. స్కాంలో ఏపీ ప్రభుత్వం తప్పు చేయకుంటే విచారణకు సిద్ధపడాలి. ఏం జరిగింది? బాధ్యులెవరు అనేది బయటకు రావాలి. టీడీపీ అంటే తెలుగుప్రజల సమాచారం దొంగిలించే పార్టీగా మారింది. సేవామిత్ర యాప్ లోకి కలర్ ఫోటోలు ఎలా వెళ్లాయి. ఐటీగ్రిడ్ కుంభకోణంపై ఆధార్ సంస్ధ, ఎన్నికల కమీషన్, సైబర్ క్రైమ్ పోలీసు విచారణలు జరపాల్సిందే’’ అని పేర్కొన్నారు. (ఐటీగ్రిడ్స్ స్కాం: అధికారుల్లో టెన్షన్.. టెన్షన్)
Comments
Please login to add a commentAdd a comment