సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బుగ్గున మాట్లాడుతూ.. ప్రతిరోజూ సంబంధంలేని విషయాలను టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
తమలో అసహనం లేదని, సభ సజావుగా జరగాలనే తాము భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అంశంపై చర్చ జరుగుతుంటే.. ఒక పేపర్ క్లిప్పింగ్‌ను పట్టుకొని టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ కూడా మూడుసార్లు సభలో సమాధానం ఇచ్చారని, వాస్తవాలు తెలుపుతూ వీడియో కూడా ప్రసారం చేశారని బుగ్గన తెలిపారు. ఎన్నోసార్లు సభలో మాట్లాడాలని అవకాశం ఇచ్చినా.. టీడీపీ సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సభను టీడీపీ వాడుకుంటోందని ఆయన అన్నారు.
9వేల ప్రభుత్వ పాఠశాలలు మూయించారు: అమర్‌నాథ్
అనంతరం వైఎస్సార్‌సీపీ సభ్యుడు గుడివాడ అమర్‌నాథ్ సభలో విద్య అంశంపై మాట్లాడారు. ప్రతి పేద విద్యార్థికీ సమాన హక్కులు ఉండాలని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తొమ్మిది వేల ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు మూయించారని తెలిపారు. విద్య ఖరీదైన అంశంగా మారిందన్నారు. ఫీజులు విపరీతంగా మారుతుండటం ప్రజలకు భారంగా పరిణమించిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు విద్య విషయంలో మేలు చేయాలని సంకల్పించిందని, అందుకే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment