చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య జలాశయం దిగువ ప్రాంతంలో ఇసుక క్వారీలను నిషేధించాలంటూ నది పరీవాహక ప్రాంత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
రాజంపేట : చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య జలాశయం దిగువ ప్రాంతంలో ఇసుక క్వారీలను నిషేధించాలంటూ నది పరీవాహక ప్రాంత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. గురువారం రాజంపేట ఆర్డీవో కార్యాలయం సమీపంలో కమిటీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షలను చేపట్టారు. ఆయనతోపాటు సర్పంచులు ఆరీప్(ఓబిలి), వెంకటసుబ్బయ్య(నల్లతిమ్మాయపల్లె), కె.సుబ్బరాయుడు (కుందానెల్లూరు), నరసింహులు(టంగుటూరు) ఆమరణదీక్షలో పాల్గొన్నారు.
రాజంపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకాసురులను నిలదీసే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఇసుకను ఇష్టానుసారంగా తరలించడం దారుణమన్నారు. దీనివల్ల నీటి లభ్యతకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇసుకక్వారీలకు ఇలా అనుమతి ఇస్తూ పోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని తెలిపారు. ఎక్కడకక్కడే ఇసుకలారీలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఇసుకను కాపాడుకోకపోతే చెయ్యేరు నదీపరీవాహక ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయన్నారు. చెయ్యేరు పరీవాహక పరిరక్షణకమిటి అధ్యక్షుడు, న్యాయవాది కృష్ణకుమార్ మాట్లాడుతూ చెయ్యేరు వల్ల రాజంపేట, పెనగలూరు మండలాలు సస్యశ్యామలంగా ఉండేవని, ప్రభుత్వం ఇసుక అమ్మడానికి అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టినప్పటికి నుంచి కరువు పరిస్ధితలు దాపురించాయన్నారు. టీడపీ నాయకుడు మోదుగల పెంచలయ్య మాట్లాడుతూ ఇసుక తవ్వకాల వల్ల అత్తిరాలలో మడుగు అడుగంటిపోయిందన్నారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికైనా ఇసుక దోపిడీని అరికట్టకపోతే భావితరాలకు తీవ్ర నష్ట వాటిల్లుతుందన్నారు. వీరితోపాటు కొప్పలసుబ్బన్న, జీవీసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా కలిసిరావాలి: గోపిరెడ్డి
చెయ్యేరులో ఇసుక క్వారీల నిషేధానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెయ్యేరు నదీపరీవాహక పరిరక్షణ కమిటి కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య డ్యాం ఎగువ ప్రాంతంలో ఇసుకక్వారీలకు అనుమతులు ఇస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. రాజంపేట ఆర్డీవో ప్రభాకర్‌పిళ్లై దీక్షాశిబిరానికి వచ్చి దీక్షను విరమించాలని హెచ్చరించారన్నారు. ఎలాంటి పరిస్ధితుల్లో ఇసుక క్వారీ నిషేధం కోసం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలను కొనసాగిస్తామని వెల్లడించారు.
తరలివచ్చిన నేతలు, రైతులు
నిరాహారదీక్షకు నందలూరు, రాజంపేట, పెనగలూరు మండలాలకు చెందిన నేతలు, నాయకులు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. టీడీపీ నేతలు మోదుగుల పెంచలయ్య, పెనగలూరు మండలపార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, బీసీనేత వర్ధిబోయన సుధాకర్‌బాబు, సీపీఐ ఏరియా కార్యదర్శి మహేశ్, ఎఐటీయుసీ నేత ఎంఎస్‌రాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు జీవీసుబ్బారెడ్డి, నాగినేని నాగేశ్వర్‌నాయుడు, హస్తవరం వేణురెడ్డి, భాస్కరరాజు, జీవీసుబ్బరాజు, శివరామరాజు, విస్సీ, పసుపులేటి సుధా, దళితనేతలు కొప్పల సుబ్బన్న, దండుగోపి, మోడపోతుల సుధా, గీతాల నరసింహారెడ్డి, విజయకుమార్, సర్పంచి బుర్రునాగేశ్వరరావు, మాజీ సర్పంచి గంగినాయుడు తదితరులు మద్దతు ప్రకటించారు.