పంపకాల్లో మంత్రులు బిజీ! | Busy distributions ministers! | Sakshi
Sakshi News home page

పంపకాల్లో మంత్రులు బిజీ!

Published Thu, Feb 6 2014 2:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Busy distributions ministers!

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికల్లో గట్టెక్కేందుకు అవసరమయ్యే కేడర్‌ను కాపాడుకోవడానికి మంత్రులిపుడు ధనాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు, సర్పంచులకు భారీ ఎత్తున నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు పనులను కట్టబెడుతున్నారు. నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులను చేస్తోన్న కాంట్రాక్టర్ల నుంచి గుడ్‌విల్‌ను లాగుతున్న మంత్రులు.. దాన్ని కేడర్‌కు పంపిణీ చేస్తున్నారు. గ్రామ సభలతో నిమిత్తం లేకుండా ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టి.. వాటిని కాంగ్రెస్ నేతలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలంటూ ఎంపీడీవోలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.

 చివరి దశలో మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుండటంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రజాగ్రహంతో ఆ పార్టీ కేడర్‌లో నైతిక స్థైర్యం దెబ్బతింది. చెట్టుకొకరు.. పుట్టకొకరు చెదిరిపోయారు. మరో మూడు వారాల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో కేడర్‌ను కాపాడుకోకపోతే మొదటికే మోసం వస్తుందని మంత్రులు భావించారు. కేడర్‌ను కాపాడుకోవడానికి యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
 
 నామినేషన్ అస్త్రానికి పదును..
  శింగనమల నియోజకవర్గంలో మంత్రి శైలజానాథ్ కేడర్‌ను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.ఐదు కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువ పనులు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి.. అంచనాలు సిద్ధం చేయించారు.
 
 ఆ పనుల్లో ఒక్కో దాని విలువ రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల్లోపు ఉండేలా అధికారులపై ఒత్తిడి తెచ్చిన మంత్రి.. వాటికి టెండర్లు నిర్వహించకుండా చక్రం తిప్పారు. ఆ పనులను ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, సర్పంచులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేస్తున్నారు. వాటికి సంబంధించిన బిల్లులను తనకు సమాచారం ఇచ్చిన తర్వాతనే మంజూరు చేయాలని అధికారులకు షరతు పెట్టారు. ఎన్నికల్లోగా ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే.. వారు చేసిన పని బిల్లును ఆపేశాలా వ్యూహం రచించారు.
 
  కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అదే బాటలో పయనిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధితోపాటూ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.6 కోట్లతో చేపట్టే పనులను నామినేషన్ పద్ధతిలోనే కాంగ్రెస్ నేతలకు కట్టబెడుతున్నారు. బిల్లుల చెల్లింపు విషయంలోనూ మంత్రి శైలజానాథ్ శైలినే అనుసరిస్తున్నారు.
 
 అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ తన శాఖ పరిధిలోని సర్వ శిక్ష అభియాన్ పథకం నిధులను భారీగా దుర్వినియోగం చేస్తున్నారు. ఆ పథకం కింద చేపట్టే ప్రతి పనినీ నామినేషన్‌పై కాంగ్రెస్ నేతలకు కట్టబెట్టాలంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మూడు నెలల పరిధిలో శింగనమల నియోజకవర్గంలోనే రూ.25 కోట్ల విలువైన పనులను ఇదే పద్ధతిలో నామినేషన్‌పై కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టారు. రెవెన్యూ మంత్రి రఘువీరా కూడా ఏం తక్కువ తినలేదు. ఉపాధి హామీ నిధులను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామ సభలతో నిమిత్తం లేకుండా పనులు మంజూరు చేయాలంటూ ఎమ్పీడీవోలపై ఒత్తిడి తెస్తున్నారు.
 
 ఆ పనులను కాంగ్రెస్ కార్యకర్తలకే నామినేషన్‌పై కట్టబెట్టాలంటూ డ్వామా పీడీ సంజయ్ ప్రభాకర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో రూ.13 కోట్లతో రెండు రోడ్ల అభివృద్ధికి ఇటీవల టెండర్లు పిలిచారు. ఆ పనులను చేజిక్కించుకునే కాంట్రాక్టర్ల నుంచి గుడ్‌విల్‌ను వసూలు చేసి.. ఆ రోడ్డు పరిధిలోని నేతలకు పంపిణీ చేయడానికి మంత్రి వ్యూహం రచించారు. రెవెన్యూ మంత్రి రఘువీరా నియోజకవర్గంలో గుడ్‌విల్ పంపిణీపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇటీవల మంత్రి ఇంట్లోనే గుడ్‌విల్ కోసం కాంగ్రెస్ నేతలు గొడవ పడటమే అందుకు తార్కాణం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement