సాక్షి, అనంతపురం : ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేస్తున్న దుస్తుల (యూనిఫాం) నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)లోని కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతూ నాణ్యత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కుట్టు కాంట్రాక్టర్ల నుంచి ఒక్కో జతపై రూ.10 కమీషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు, కస్తూరిబా పాఠశాలల్లో ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రతియేటా రెండు జతల యూనిఫాం పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల యూనిఫాం కోసం వస్త్రాన్ని సరఫరా చేసే కాంట్రాక్టును ఆప్కో సంస్థ తీసుకుంది. యూనిఫాం కుట్టే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు తిరిగి సబ్ కాంట్రాక్టు కింద అనుభవం లేనివారికి ఇచ్చారు. ఇందులో ఓ ప్రజాప్రతినిధి ముఖ్య భూమిక పోషించారు. ఆ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లకు వస్త్రం ఇచ్చే సమయంలో ఆర్వీఎంలోని కొందరు అధికారులు ఒక్కో జతపై రూ.10 చొప్పున కమీషన్ పుచ్చుకుంటున్నారు. కమీషన్ నేరుగా తీసుకోకుండా ఆ బాధ్యతను కలెక్టరేట్ వెనుక వైపున ఉన్న ఆప్కో గోదాములోని సిబ్బందికి అప్పగించారు. యూనిఫాం కుట్టే బాధ్యత పత్రాన్ని ఆర్వీఎం అధికారుల నుంచి పొందిన తరువాత కాంట్రాక్టర్ ఆప్కో గోదాముకు వెళ్లి వస్త్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఆప్కో గోదాములోని సిబ్బందిని ఆర్వీఎం అధికారులు కమీషన్ వసూలు చేయాలని పురమాయిస్తున్నారు.
అందులో వీరికీ కొంత మొత్తం విదిలిస్తుండటంతో.. అధికారుల ఆదేశాలను గోదాము సిబ్బంది తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఒక్కోసారి కాంట్రాక్టర్ల వద్ద కమీషన్ ఇచ్చేంత డబ్బులు లేకపోతే పరిస్థితి మరోలా ఉంటోంది. వస్త్రం తరువాత ఇస్తాం..., పెద్ద సార్లు లేరంటూ నానా సాకులు చెబుతూ గోదాము చుట్టూ తిప్పుకుంటున్నారు. దీంతో కాంట్రాక్టర్ వస్త్రం తీసుకోవడం ఆలస్యమై.. ఇష్టానుసారంగా విద్యార్థుల కొలతలు తీసుకుని కుట్టేస్తున్నారు. దీంతో కుట్టు నాసిరకంగా ఉండడంతో పాటు యూనిఫాం కొంత మందికి బిగుతుగా, మరికొందరికి లూజుగా ఉంటోంది.
విచారించి చర్యలు తీసుకుంటాం
యూనిఫాం కుట్టు విషయంలో కార్యాలయంలోని సిబ్బంది కమీషన్లు తీసుకుంటున్న విషయం నాకు ఇంత వరకు తెలీదు. వెంటనే విచారిస్తా. ఇందులో ఎవరి హస్తమున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
- రామారావు, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్, అనంతపురం
కుట్టులోగుట్టు!
Published Tue, Jan 14 2014 2:18 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement