చాపకింద ’నీరు’లా.. | contractors miss use the money | Sakshi
Sakshi News home page

చాపకింద ’నీరు’లా..

Published Sun, Jul 30 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

చాపకింద ’నీరు’లా..

చాపకింద ’నీరు’లా..

’నీరుచెట్టు’లో అవినీతి పర్వం 
నిధులు మట్టిపాలు
పురోగతి లేని పనులు 
నాణ్యత దేవుడికెరుక
అధికారుల చోద్యం 
 
 
నీరుచెట్టు పథకంలో అవినీతి చాపకింద నీరులా ప్రవహిచింది. రూ.కోట్లు పక్కదారి పట్టాయి. చేసినవి కొద్ది పనులే అయినా నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. 
 
ఆకివీడు : ఎప్పట్లానే ఈ ఏడాదీ నీరుచెట్టు పథకం నిధులు నీటిపాలయ్యాయి. చాపకింద నీరులా అవినీతి పరవళ్లు తొక్కింది. జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ ఎన్నిసార్లు హెచ్చరించినా  నీటి సంఘాలు ఖాతరు చేయలేదు. ఇరిగేషన్‌ అధికారుల తీరు మారలేదు. జిల్లాలో కాలువలు, డ్రెయిన్లులో మట్టి తొలగింపు, పూడిక తీత, గట్లు పటిష్ట పరిచే పనులను నీరుచెట్టు పథకంలో చేపట్టారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.160 కోట్లు ఏప్రిల్‌ నెలాఖరున విడుదల చేసింది. వీటితో వివిధ ప్రాంతాల్లో 666 పనలు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ పనులను చేపట్టేందుకు నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల  ప్రతినిధులు ముందుకు వచ్చారు.  పనులను తమకంటే తమకే ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రులతో ఒత్తిడి చేయించి మరీ తీసుకున్నారు. అయితే వాటిని సకాలంలో మొదలు పెట్టలేదు. మే నెల 15కి గానీ పనులు ప్రారంభించలేదు. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ పనులు చేపట్టలేదు. జిల్లావ్యాప్తంగా కేవలం 150 పనులను మాత్రమే తూతూమత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. రూ.70కోట్లు బిల్లులు డ్రా చేసుకున్నారు.  
 
పత్తాలేని క్వాలిటీ కంట్రోల్‌ 
చేసిన 150 పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల తనిఖీ లేకపోవడంతో రూ.70కోట్లు నీటిపాలయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చేసిన అవినీతి పనులు కొట్టుకుపోయాయి. పలు చోట్ల గట్లు అండలుగా జారిపోయాయి. పంట కాలువల్లో పూడిక తీశామని చెబుతున్నా.. నీటి ప్రవాహం చూస్తే అసలు పనులు చేసినట్టే అనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 
 
కొన్ని చోట్ల నిధులే ఇవ్వలేదు 
ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో కాలువల్లో పూడిక పేరుకుపోయినా  పూడిక తీయించలేదు. కర్రనాచు పేరుకుపోయి నీటి ప్రవాహానికి తీవ్ర అవరోధం ఏర్పడుతోందని రైతులు మొత్తుకున్నా.. అధికారులు నిధులు కేటాయించలేదు. ఇప్పటికైనా మిగిలిన నిధుల నుంచి తమ ప్రాంతాల్లో పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 
 
జారిపోయింది
వెంకయ్యవయ్యేరులో కర్రనాచు మొలకెత్తకుండా బెడ్‌ కాంక్రీట్‌ నిర్మించారు. అయితే బెరమ్స్‌ నిర్మాణం చేపట్టకపోవడంతో మళ్లీ యథాస్థితికి చేరింది.  నీరుచెట్టులో రూ.18 లక్షలతో పూడిక తీసి మట్టిని గట్టుపైకి చేర్చి వదిలేశారు. మళ్లీ ఆ మట్టి కాలువలోకి జారిపోయింది. ఈ పనుల వల్ల ఉపయోగమేముంది?  
 గ్లాడ్‌సన్, యువ రైతు, చెరుకుమిల్లి.
150 పనులు పూర్తి 
జిల్లాలో నీరుచెట్టు పథకం 150 పనుల పూర్తయ్యాయి. రూ.70కోట్లు ఖర్చయ్యాయి. చెరువుల్లోనూ, కాలువల్లో పూడిక తీత, మట్టి పనులు జరిగాయి. మిగిలిన పనులు వానలు తెరిపించిన తర్వాత చేపట్టేందుకు చర్యలు చేపడతాం. 
శ్రీనివాస్, సూపరింటెండెంట్‌ ఇంజినీర్, నీటిపారుదల శాఖ, ఏలూరు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement