నిబంధనలు పాటించరా?
శాటిలైట్ టౌన్ పనుల సమీక్షలో ఎమ్యెల్యే సంజీవరావు మండిపాటు
వికారాబాద్: చట్టాలు కాంట్రాక్టర్లకు,అధికారులకు వర్తించవా అని వికారాబాద్ శాసనసభ సభ్యులు బి. సంజీవరావు ప్రశ్నించారు. తప్పు చేసిన వారెంతటివారైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శాటిలైట్‌టౌన్ పనులకు సంబంధించిన సమీక్ష సమావేశంలో ఆయన సంబంధిత అధికారులతో పాటు ఆ పనులు చేస్తున్న నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ సిబ్బందితో మాట్లాడారు.
పట్టణంలో జరుగుతున్న శాటిలైట్‌టౌన్ పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఎవరి హాయంలో ఈ పనులు జరిగాయే వారినే బాధ్యులను చేసి చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులనుద్దేశించి అన్నారు. పట్టణంలో ఈ పనులతో రోడ్లన్ని పూర్తి స్థాయిలో పాడైపోయి దుమ్ముదూళీ ఎక్కువైందని, దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని చెబుతూ ఈ నేపథ్యంలో ప్రత్యమ్నాయ చర్యలు తీసుకోవలసి బాధ్యత మీపై ఉన్నదనే విషయాన్ని మీరెందుకు విస్మరించారని ఆయన అధికారులను నిలదీశారు. శాటిలైట్‌టౌన్ కింద చేపట్టిన అండర్‌డ్రైనేజీ,అండర్ వాటర్ సప్లయి పైపులై న్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. శాటిలైట్‌టౌన్ గైడ్‌లైన్స్‌లో పొందు పరచిన నిబంధనల ప్రకారమే పనులు జరగకపోతే తిరిగి ఆ పనులను చే యించడానికి తాను వెనకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
పట్టణంలో యూజీడీ పైప్‌లైన్ ఏర్పాటుకు రూ.64 కోట్లను,అండర్‌గ్రౌండ్ వాటర్ పైప్‌లైన్‌కు రూ.76 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది... మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని నిధులను ఖర్చు చేసి ఎంత వరకు పనులను పూర్తి చేశారని నిలదీశారు. ఈ నేపథ్యంలో పబ్లిక్‌హెల్త్ డిపార్టుమెంట్ ఎస్‌ఈ సమాధానమిస్తూ యుజీడీకి సంబంధించి రూ.31 కోట్ల వరకు, అండర్‌గ్రౌండ్ నుంచి మంచినీటి సరఫరా పైపు లైన్ ఏర్పాటుకు రూ.51 కోట్ల పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. డ్రైనేజీ పైప్‌లైన్ 96 కిలోమీటర్ల మేర, మంచినీటి పైప్‌లైన్120 కిలోమిటర్ల మేర పనులు పూర్తి అయినట్లు తెలిపారు. రెండు సంవత్సరాల కాల వ్యవధి తమకు ప్రభుత్వం కేటాయించిందని, ఇప్పటికి సంవత్సరం పూర్తి కాగా ఇంకా సమయం ఉందన్నారు. పట్టణంలో తవ్వేసిన రోడ్లకు సంబంధించి ప్యాచ్ వర్కులను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.
పార్కుల్లో వాటర్‌ట్యాంకులా!
భారత ప్రధాన న్యాయస్థానం ప్రజలకు సంబంధించిన పార్కు స్థలాల్లో ఎలాం టి నిర్మాణాలను చేపట్టొద్దని స్పష్ట మెన ఆదేశాలను జారీ చేసింది. మరి ఈ విషయం అధికారులకు తెలియదా లేక తెలిసి కూడా ఎన్‌సీసీకి అనుకూలంగా వ్యవహరించాలని మున్సిపల్ అధికారులు భావించారా అని ఎమ్మెల్యే నిలదీశారు. శాటిలైట్‌టౌన్ సంబంధించిన వాటర్ ట్యాంకులను పట్టణంలోని పార్కుల్లో ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ఈ విషయమై ఎవరైన కాలనీ వాసులు సుప్రీంకోర్టుకు వెళ్లితే పనులు ఆగిపోయే అవకాశం ఉంది కదాని నిలదీశారు.
పట్టణంలో నాలుగు చోట్ల పార్కు స్థలాల్లో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు.ఒక్కొక్క ట్యాంక్ నిర్మాణం కోసం సుమారుగా 400 నుంచి1000 గజాల స్థలం తీసుకున్నారు వీటి విలువ సుమారుగా రూ.4 కోట్ల వరకు ఉంటుందన్నారు.వాటర్ ట్యాంకుల ఏర్పాటుతో పట్టణ ప్రజలకు పార్కులు అందుబాటులో లేకుండా పోయాయని అధికారులపై మండిపడ్డారు. పనిచేయని అధికారులు దయ చేసి ఇక్కడినుంచి బదిలిపై వెళ్లిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జైత్రామ్‌నాయక్,పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి , డీఈ గోపాల్,ఏఈ హన్మంత్‌రావునాయక్,ఎన్‌సీసీ సిబ్బంది అవినాష్ తదితరులు పాల్గొన్నారు.