ఆడపిల్లలు పుట్టడమే పాపమా?
కర్నూలు: కఠిన శిక్షలు లేకపోవడం వల్లే మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పెచ్చుమీరుతున్న అత్యాచార ఘటనల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామని చెప్పారు. కర్నూలు పట్టణంలో అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికను మంగళవారం ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇది బాధకరమైన విషయం అన్నారు. ఏ ఇంట్లో కూడా ఇలాంటి దారుణం జరగకూడదన్నారు. ఆడపిల్లలు పుట్టడమే పాపం అన్నట్టు పరిస్థితి తయారు చేస్తున్నారు. ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలన్న భయంతో తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. ఆడుకోవడానికి పిల్లలకు బయటకు పంపించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేపిస్టులను కఠిన శిక్షలు అమలు చేసినప్పుడే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. కొన్ని దేశాల్లో రేపిస్టులను బహిరంగంగా ఉరి తీస్తారు కాబట్టే అక్కడ ఇలాంటి నేరాలు తక్కువని గుర్తు చేశారు. మన చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
కర్నూలులోని కడగ్ పూరా కాలనీకి చెందిన ఖాజా భాషా అనే వ్యక్తి శనివారం రాత్రి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కర్నూలు పెద్దాసుపత్రిలో ఉన్న నిందితుడిపై పాతబస్తీ వాసులు సోమవారం దాడికి యత్నించారు. నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.