సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. కర్నూలు పార్లమెంట్ సీటును కోట్లకు కేటాయించే అవకాశముంది. దీంతో తన పరిస్థితి ఏమిటంటూ బుట్టా రేణుక నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. ఇంకా సీట్ల విషయం ఖరారు కాలేదని పేర్కొన్న సీఎం.. వాటి గురించి తర్వాత మాట్లాడదామంటూ ముక్తసరిగా ఫోన్ సంభాషణ ముగించినట్టు సమాచారం. దీంతో ఆమె మరింతగా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. కాగా.. బుట్టా పార్టీ మారేటప్పుడు టీడీపీలోఎంతో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా తిరిగి ఎంపీ సీటు కేటాయిస్తామని చెప్పారని ఆమె వర్గీయులు అంటున్నారు. స్వయంగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటన సందర్భంగా ఎంపీగా బుట్టాను తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ‘జయహో బీసీ’ అని నినదిస్తూనే ఒక బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని అధికార టీడీపీ వైఖరిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఎలా వెళతాం!
వాస్తవానికి బుట్టా రేణుక రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ఆమెను గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీకి ఉన్న బలంతో ఆమె ఎంపీగా గెలిచారు. తీరా గెలిచిన తర్వాత ఆమె భర్త తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె మాత్రం వైఎస్సార్‌సీపీలో కొనసాగారు. అయితే, టీడీపీ ఆకర్ష్ పథకంలో భాగంగా రూ.50 కోట్ల నగదుతో పాటు ఆమె పాఠశాలకు అమరావతిలో భూ కేటాయింపునకు హామీ పొందారు. తీరా టీడీపీలో చేరిన తర్వాత ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ సీటు కూడా లేకుండా పోతోంది. అయితే.. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఆశతో వర్గీయులు ఉన్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి మంత్రి లోకేష్ అండదండలున్నాయి. దీంతో ఆయనకే టికెట్ ఇస్తారని అంటున్నారు. ఫలితంగా రెంటింకీ చెడ్డ రేవడిలా బుట్టా పరిస్థితి తయారైంది. ఇదే తరుణంలో బీసీ మహిళకు టీడీపీ అన్యాయం చేసిందన్న అభిప్రాయాన్ని బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ వైఖరిపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పెద్దన్నగా పిలవబడే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి కనీసం కోట్ల చేరికపై సమాచారం కూడా లేకపోవడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మౌనంగా కేఈ వర్గం
జిల్లాలో మొదటి నుంచి కోట్ల, కేఈ కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇరువర్గాలకు చెందిన అనేక మంది నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్‌కు బలైపోయారు. గ్రామాల వారీగా వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు కోట్ల టీడీపీలో చేరనుండడంతో కేఈ వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచి రాజకీయ వైరుధ్యంతో ఉన్న కోట్లతో ఎలా సర్దుకుపోతామంటూ పార్టీ వైఖరిపై ఆగ్రహిస్తున్నారు. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా గుమ్మనంగా స్పందించారు. కోట్ల చేరికపై తనకు సమాచారం లేదన్నారు. అంతేకాకుండా తమ సీటు అడిగితే అప్పుడు స్పందిస్తానని పరోక్షంగా సంకేతాలు పంపారు. మొత్తమ్మీద ప్రస్తుత పరిణామాలను కేఈ వర్గం సునిశితంగా గమనిస్తోంది. కోట్లకు ఏయే సీట్లు ఇవ్వనున్నారనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ పూర్తిస్థాయి స్పందన తెలియజేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment