సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ సాక్షిగా అధికార పార్టీలో కమీషన్ల కొట్లాట మొదలైంది. కార్పొరేషన్ పరిధిలో టెండర్ల వ్యవహారమంతా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రమే చూస్తున్నారని, ఎవ్వరినీ తలదూర్చనీయడం లేదని కొన్నాళ్ల క్రితం అధికార పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక వర్గం లోలోన మండిపడుతోంది. ఈ క్రమంలోనే ప్రొటోకాల్ ఉల్లంఘన అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కార్పొరేషన్‌లో టెండర్ల వ్యవహారాలను ఎమ్మెల్యే ఏకపక్షంగా నడుపుతున్నారు. ప్రతి పని ఆయన చెప్పిన మనుషులకే దక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అమృత్ పథకం పనులను కూడా ఎమ్మెల్యే వర్గీయులే చేస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం మొదలు డ్రైనేజీ పనుల వరకు.. చివరకు చెత్త సేకరణ కాంట్రాక్ట్ కూడా వారే తీసుకున్నారు. ఎంపీ బుట్టా రేణుకకు కనీసం పనుల సమాచారం కూడా ఇవ్వడం లేదన్నది ఆమె వర్గీయుల వాదన. ఈ నేపథ్యంలోనే ప్రొటోకాల్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. మునిసిపల్ కమిషనర్ హరినాథరెడ్డిపలు ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఎంపీ బుట్టా జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అనేక నిబంధనలను కూడా పేర్కొంటూ మరీ కమిషనర్‌పై మండిపడుతున్నారు. వాస్తవానికి కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ పనుల్లో ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తే ఇంత రచ్చకు దారితీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎవ్వరూ వేలు పెట్టొద్దు!
కార్పొరేషన్ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అధికార పార్టీ నేతలే మండిపడుతున్నారు. గతంలో కార్పొరేషన్ టెండర్ల వ్యవహారాలు కేఈ కుమార్ చూసేవారు. అయితే, ఎమ్మెల్యే ఎస్వీ పార్టీ మారిన తర్వాత కేఈ కుటుంబం నుంచి పూర్తిగా తప్పించారు. ఇందుకోసం ఫిర్యాదులు చేసి మరీ కేఈ కుటుంబ పెత్తనం లేకుండా చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెప్పిన వారికి కాకుండా వేరే వారికి కాంట్రాక్టులు దక్కే పక్షంలో ఏకంగా టెండర్లనే రద్దు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్ల వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే ఎటూ తేల్చడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరే కాంట్రాక్టర్‌కు పనులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ టెండర్‌ను రద్దు చేయించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం కూడా ఎంపీ బుట్టా వద్దకు వెళ్లినట్టు సమాచారం. తమ వారికి ఒక్క పని కూడా ఇవ్వడం లేదని బుట్టా వర్గీయులు వాపోతున్నారు. అశోక్‌నగర్ పంపుహౌస్ వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ కోసం స్థల కేటాయింపుతో మునిసిపల్ కమిషనర్, ఎంపీ వర్గీయుల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇచ్చారని, తమకు కనీస సమాచారం లేదని వారు మండిపడుతున్నారు. పైగా కమిషనర్.. ఎమ్మెల్యే చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో కార్యక్రమాల నిర్వహణ విషయంలోనూ ఎంపీగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ఎంపీ బుట్టా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment