
కర్నూలు: కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య మళ్లీ లొల్లి మొదలైంది. కర్నూలు టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే ఎస్వీ చేసిన వ్యాఖ్యలపై టీజీ ఘాటుగా స్పందించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానిదో లేక టీజీ వెంకటేశ్ కుటుంబానిదో కాదన్నారు. కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఓటర్ల ఆస్తి అన్నారు.
పార్టీ అధినేత సర్వేలు చేయించి టికెట్ కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమన్నారు. నిన్న సీటు తనకేనని చెప్పిన ఎస్‌వీ మోహన్ రెడ్డి, నేడు లోకేష్ నిలబడితే సమర్థిస్తానని చెప్పడం సరికాదన్నారు. లోకేష్ నిలబడితే అందరం సమర్థిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి జనాలను గందరగోళానికి గురిచెయ్యడం తప్ప ఇంకేమీ లేదన్నారు. గెలిచే అభ్యర్థికే చంద్రబాబు పట్టం కడతారని మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని పరోక్షంగా హెచ్చరించారు.