సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ప్రారంభించిన ‘విజన్ యాత్ర’ అధికార పార్టీలో ఫిర్యాదుల పరంపరకు తెరలేపింది. ఈ యాత్రను వెంటనే ఆపేయించాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి విన్నవించారు. కర్నూలు నియోజకవర్గం నుంచి ఇప్పటికే తన పేరు ప్రకటించిన నేపథ్యంలో భరత్ యాత్ర వల్ల కేడర్‌లో గందరగోళం ఏర్పడడమే కాకుండా అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతోందని వివరించినట్లు సమాచారం.
అయితే, యాత్ర ఆపేయాలంటూ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలూ రాకపోవడంతో మరింత జోరు పెంచేందుకు టీజీ భరత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎస్వీతో విభేదిస్తున్న ఎంపీ బుట్టా రేణుకను ముందు పెట్టడం ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపం కాదని, పార్టీ కోసమే యాత్ర చేస్తున్నామన్న సందేశాన్ని ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యంలో బుట్టా రేణుకకు అసలు ఎంపీ సీటే రాదని ఎమ్మెల్యే వర్గం ప్రచారం ప్రారంభించింది. ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా ఈ సందర్భంగా అంటున్నారు.
సర్వే పేరుతో..
వాస్తవానికి టీడీపీలో సీట్ల కేటాయింపు సర్వే ప్రకారం జరుగుతోంది. చివరి నిమిషం వరకూ సీటు ఎవరికిస్తారనే విషయం రహస్యంగా ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా ముందుగానే కర్నూలు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ, ఎంపీ స్థానానికి బుట్టా రేణుక పోటీ చేస్తారని నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. దీనిపై ఎంపీ టీజీ భగ్గుమన్నారు. సీటు ప్రకటించడానికి అసలు లోకేష్ ఎవరంటూ మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందనా రాలేదు.
దీంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. నగర ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే విజన్ యాత్ర ప్రారంభించానని, 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని యాత్ర ప్రారంభం సందర్భంగా టీజీ భరత్ ప్రకటించారు.పరోక్షంగా ఎమ్మెల్యే అవినీతిపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. నగర ప్రజలు అవినీతి లేని అభివృద్ధి కోరుకుంటున్నారని, గతంలో తాము అదే చేశామని అంటున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఎంపీ బుట్టా రేణుక కూడా స్వరం కలిపారు. తద్వారా సీటు విషయంలో తన సపోర్ట్ భరత్‌కేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏయే పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment