
వైఎస్సార్ సీపీలో కొనసాగుతా..టీడీపీ సభ్యురాలిగా ఉంటా!
ఢిల్లీ: తాను వైఎస్సార్ సీపీలో కొనసాగుతూనే..టీడీపీ అసోసియేట్ సభ్యురాలిగా ఉంటానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రెండు విరుద్ధ ప్రకటనలు చేశారు. వైఎస్సార్ సీపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసిన మాట వాస్తవమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గెలిచిన వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరడానికి కాదని రేణుక తెలిపారు. తన నియోజక వర్గ అభివృద్ధిలో భాగంగానే చంద్రబాబును కలిసినట్లు ఆమె తెలిపారు. అయితే టీడీపీ అసోసియేట్ సభ్యురాలిగా ఉంటానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కర్నూలు ఎంపీగా ప్రజలకు అభివృద్ధి అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ అంశాలపై చర్చించడానికి తాను బాబు కలవలేదని..అభివృద్ధిలో భాగంగానే ఆయన్ను వ్యక్తిగతంగా కలిశానంటూ తెలిపారు. ఒక పార్టీలో ఉంటూ.. మరో పార్టీలో సభ్యురాలిగా ఎలా కొనసాగుతారని మీడియా ప్రశ్నించగా తనకు ఆ విషయం అంతగా తెలియదంటూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు.