
నేను వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతా:ఎంపీ బుట్టా రేణుక
తాను వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు.
కర్నూలు: తాను వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసిన మాట వాస్తవమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గెలిచిన వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరడానికి కాదన్ని రేణుక తెలిపారు. తన నియోజక వర్గ అభివృద్ధిలో భాగంగానే చంద్రబాబును కలిసినట్లు ఆమె తెలిపారు.
ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బట్టా రేణుక కూడా వైఎస్సార్ సీపీని వీడుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీంతో స్పందించిన రేణుక.. వైఎస్సార్ సీపీ వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.