
సాక్షి, విజయవాడ : తమ పార్టీ గుర్తుపై గెలిచిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏమి ఆశించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా అనుభవం లేకపోయినా ఎంపీ టికెట్ ఇచ్చి బుట్టా రేణుకను గెలిపించారన్నారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బుట్టా రేణుకా పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో టీడీపీ సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి ఆశపడే పార్టీ మారారా?. నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలోకి తొక్కారు. తన అవినీతి, చేతగాని తనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ కొనుగోళ్లు మళ్లీ మొదలుపెట్టారు. ఎందుకంటే నవంబర్ 2 నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు.
ఆ పాదయాత్రలో టీడీపీ సర్కార్ చేస్తున్న అవినీతి, మోసాలు, అక్రమాలు, ప్రజలు ఏవిధంగా అన్యాయానికి గురవుతున్నారో ఇవన్నీ బట్టబయలు అవుతాయనే భయంతో ఈ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టారు. పశువులను కొంటున్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొంటున్నారు. సిగ్గులేకుండా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. వైఎస్ జగన్ మాత్రం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారు. రాజీనామా చేశాకే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని వైఎస్‌ఆర్ సీపీలోకి చేర్చుకున్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యాలను పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క మంచి పని చేయలేదు. బలహీన వర్గాలకు చాలా హామీలిచ్చి మోసం చేశారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. పీడీబ్ల్యూడీ గ్రౌండ్‌లో చర్చిద్దాం. తేదీ, సమయం మీరే నిర‍్ణయించండి.’ అని సవాల్ విసిరారు.
బుట్టా రేణు పార్టీ ఫిరాయింపుపై ట్విస్ట్!
ఎంపీ బుట్టా రేణుక ఫార్టీ ఫిరాయింపుపై ట్విస్ట్ నెలకొంది. మంగళవారం ఉదయం తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆమె.. టీడీపీలో చేరికపై అధికారికంగా స్పష్టమైన ప్రకటన ఏమీ చేయలేదు. అనర్హత వేటుకు భయపడే ఆమె ఈ ప్రకటన చేయనట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు అమావాస్య కారణంగా బుట్టా రేణుక అధికారికంగా టీడీపీలో చేరలేదనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా, చంద్రబాబును కలిసిన అనంతరం బుట్టా రేణుక మాట్లాడుతూ అభివృద్ధి కోసమే తాను టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత మూడేళ్లుగా అభివృద్ధి పనుల కోసం చాలాసార్లు తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. అప్పుడు కూడా అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి మద్దతు తెలిపానన్నారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుతోపాటు ఎన్నికలకు అయ్యే మొత్తం వ్యయాన్ని కూడా భరిస్తామని బుట్టా రేణుకకు హామీ ఇవ్వడంతో ఆమె పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారు. అలాగే తక్షణ ప్రయోజనంగా రూ.70 కోట్ల భారీ ప్యాకేజీతోపాటు పలు కాంట్రాక్టులు కూడా కట్టబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత కర్నూలు జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి బుట్టా రేణుక అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
అదే రాజకీయ దిగజారుడుతనం...!
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోన్న విషయం విదితమే. ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. సంతలో కొనుగోలు చేసినట్టు ఒక్కొక్కరికి ఒక్కో రేటు కట్టి మరీ కొనుగోలు చేసింది. అంతేకాకుండా రాజకీయ విలువలను తోసిరాజని రాజీనామా చేయని నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు ప్యాకేజీని కూడా ఇచ్చింది. ఈ విధంగా పార్టీ మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు పొందినవారు ఇప్పటికీ రాజీనామా చేయకపోవడం గమనార్హం. ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. ఇప్పటివరకు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. తాజాగా బుట్టా రేణుకను కూడా ప్రలోభాలకు గురి చేసి, పార్టీలో చేరేలా టీడీపీ పావులు కదిపింది.
Comments
Please login to add a commentAdd a comment