ప్రస్తుతం శిక్షణలో ఉన్న 140 ఎస్‌ఐ పోస్టుల్ని వచ్చే జనవరి 21 నాటికి భర్తీ చేస్తామని డీఐజీ పి.ఉమాపతి తెలిపారు.
దేవరాపల్లి, న్యూస్‌లైన్ : ప్రస్తుతం శిక్షణలో ఉన్న 140 ఎస్‌ఐ పోస్టుల్ని వచ్చే జనవరి 21 నాటికి భర్తీ చేస్తామని డీఐజీ పి.ఉమాపతి తెలిపారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 40 పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. విశాఖ జిల్లాల్లో 17 నూతన భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
మరో నాలుగు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నక్సల్స్ బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో కొంత జాప్యం జరిగిందని, త్వరలో మిగిలిన రెండు కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. పోలీసు సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణానికి స్థల సేకరణ అనంతరం వసతి సదుపాయానికి కృషి చేస్తామన్నారు. ఈయన వెంట అదనపు ఎస్పీ ఎన్.డి.కిషోర్, అనకాపల్లి డీఎస్పీ మూర్తి తదితరులున్నారు.
ట్రాఫిక్‌ను నియంత్రించండి ః
దేవరాపల్లిలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య ని యంత్రణకు చర్యలు తీసుకోవాలని చోడవరం మా ర్కెట్ కమిటీ చైర్మన్ కిలపర్తి భాస్కరరావు డీఐజీ ఉమాపతిని కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.