చక్కెర ఫ్యాక్టరీలకు చే(టు)దు కాలం | By sugar factories (to) hold time | Sakshi
Sakshi News home page

చక్కెర ఫ్యాక్టరీలకు చే(టు)దు కాలం

Published Mon, Jan 27 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

చక్కెర ఫ్యాక్టరీలకు చే(టు)దు కాలం

చక్కెర ఫ్యాక్టరీలకు చే(టు)దు కాలం

  • అమ్మకం ధర టన్ను రూ.2,600
  •  ఉత్పత్తి వ్యయం రూ.3,400
  •  ధరలేక పేరుకుపోతున్న నిల్వలు
  •  గడ్డు స్థితిలో చక్కెర ఫ్యాక్టరీలు
  •  మార్కెట్‌లో పంచదార ధర రోజురోజుకూ ఎప్పుడూ లేనంతగా తగ్గిపోతోంది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున దేశీయ చక్కెర మార్కెట్‌లోకి దిగుమతి అవుతుండటంతో ఇక్కడి పంచదారకు డిమాండ్ తగ్గింది. క్రమంగా ధర క్షీణిస్తూ కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా లక్షలాది టన్నుల పంచదార కర్మాగారాల గిడ్డంగుల్లో మగ్గిపోతోంది.
     
    చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని లక్ష్మీపురం, ఉయ్యూరు, హనుమాన్‌జంక్షన్ చక్కెర కర్మాగారాల్లో పంచదార నిల్వలు గిడ్డంగులలో మూలుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఉత్పత్తి అయిన పంచదారతో పాటు పాత నిల్వలు కూడా పేరుకుపోయాయి. లక్ష్మీపురం కర్మాగారంలో 1.18 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడి 8.5 శాతం, ఉయ్యూరులో 2.60 లక్షల టన్నులకు 9.5 శాతం, హనుమాన్‌జంక్షన్‌లో 1.16 లక్షల టన్నులకు 9 శాతం సగటు రికవరీ సాధించారు. దీంతో ఆయా ఫ్యాక్టరీల ద్వారా ఈ సీజన్‌లో వరుసగా 1.03 లక్షల టన్నులు, 2.47 లక్షల టన్నులు, 1.04 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయ్యి గోడౌన్లకు చేరింది.

    2013 జూన్‌లో పంచదార ధర క్వింటాకు రూ.3,200 ఉండగా ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ జనవరి నాటికి రూ.2,600కు దిగజారింది. చలి ఎక్కువగా ఉంటే చక్కెర దిగుబడి బాగుంటుందని ఆశించి రికవరీపై గంపెడాశతో గత నవంబర్ మూడు, నాలుగో వారాల్లో క్రషింగ్ ప్రారంభించిన చక్కెర ప్యాక్టరీలకు నిరాశే మిగిలింది. చలి తగ్గిపోవటం వల్ల అనుకున్నంత రికవరీ రావటంలేదు. తగ్గిన ధరలతో చక్కెర కర్మాగారాలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయి.
     
    దిగుబడీ అంతంతే...
     
    ఈ ఏడాది చెరుకు దిగుబడీ ఆశాజనకంగా లేదు. క్రషింగ్ ప్రారంభానికి ముందే హెలెన్, లెహర్ తుపాన్ల వల్ల కురిసిన భారీ వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపాయి. ఈ ఏడాది లక్ష్మీపురం ఫ్యాక్టరీ 3 లక్షల టన్నులు, ఉయ్యూరు 8 లక్షల టన్నులు, హనుమాన్‌జంక్షన్ ఫ్యాక్టరీ 2.40 లక్షల టన్నులు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు మూడింట ఒక వంతు మాత్రమే పూర్తయింది. ఆశించినమేర రికవరీ రాకపోవటంతో క్వింటా పంచదార తయారీకి రూ.3,200 నుంచి రూ.3,400 వరకు ఖర్చవుతోంది.

    ప్రస్తుత మార్కెట్‌లో క్వింటా పంచదార ధర రూ.2,600గా ఉంది. దీనినిబట్టి చూస్తే అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కంటే తయారీపై అయ్యే ఉత్పత్తి ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ అదనపు భారంతో ఫ్యాక్టరీలు నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం ఒక్క ఫ్యాక్టరీ పైనే కాదని, రైతులకు ఇచ్చే మద్దతు ధరపై కూడా పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి చక్కెర కర్మాగారాలు ఎలా నిలదొక్కుకుని బయటపడతాయో వేచిచూడాలి.
     
     పూర్తి బాధ్యత పాలకవర్గం, యాజమాన్యానిదే?
     ఫ్యాక్టరీలలో నిల్వలు పేరుకుపోవటానికి పూర్తి బాధ్యత పాలకవర్గం, యాజమాన్యానిదేననేది రైతుల వాదన.
     
     ప్రతి మూడేళ్లు లేదా నాలుగేళ్లకోసారి చక్కెర మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉంటాయని చెబుతున్నారు.
     
     ఇది తెలిసినా ధర పతనమవుతున్న తొలినాళ్లలోనే పంచదారను అమ్మకుండా గిడ్డంగులలో నిల్వ ఉంచటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
     
     ఇది ఫ్యాక్టరీ యంత్రాంగం వైఫల్యమని విమర్శిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement