రెండు జిల్లాల అభివృద్ధిలో 36 ఏళ్లపాటు ముఖ్య భూమిక పోషించిన విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం-ఉడా) ప్రస్థానం ముగిసింది.
* ముగిసిన ఉడా ప్రస్థానం
* 36 ఏళ్లు కొనసాగిన సంస్థ
* రెండు జిల్లాలకు సేవలు
* రాజీనామా చేసిన చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి
సాక్షి, విజయవాడ : రెండు జిల్లాల అభివృద్ధిలో 36 ఏళ్లపాటు ముఖ్య భూమిక పోషించిన విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం-ఉడా) ప్రస్థానం ముగిసింది. ఉడా స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) పని చేస్తుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉడా కథ ముగిసినట్లే. కేవలం నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఉడా స్థానంలో సీఆర్‌డీఏను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం జారీచేసిన జీవోలో ప్రస్తుతం ఉన్న ఉడా సరిహద్దుల్ని పెంచుతూ సీఆర్‌డీఏ పరిధిగా ప్రకటించారు. ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పదవి నుంచి మంగళవారం తప్పుకొన్నారు. మున్సిపల్ చట్టం-1975 ప్రకారం 1978లో వీజీటీఎం ఉడా ఆవిర్భవించింది. అప్పట్లో కేవలం విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాలకే ఉడా కార్యకలాపాలు పరిమితమయ్యాయి.
కాలక్రమేణా విజయవాడ, గుంటూరు నగరాలుగా మారడంతోపాటు గత ఏడాదే ఉడా పరిధి భారీగా పెరిగింది. తొలుత 1,670 చదరపు కిలోమీటర్ల పరిమితమైన ఉడా పరిధిని 2012లో 7,068 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఉడాలో రెండు కార్పొకరేషన్లు, 10 మున్సిపాలిటీలు, 1520కి పైగా గ్రామాలు ఉన్నాయి.
పట్టణాభివృద్ధిలో కీలకపాత్ర
ప్రధానంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఉడా పరిధిలోని నగరాలు, పట్టణాల్లో పలు పార్కుల ఆధునికీకరణ, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం చేపట్టింది. నగరంలోని పాయకాపురంలో 1989లో 137 ఎకరాల విస్తీర్ణంలో లే అవుట్ వేసి ప్లాట్లు విక్రయించింది. ఆ తర్వాత 1988-90 సంవత్సరాల్లో గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నువులూరులో 390.38 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2000లో అమరావతి టౌన్‌షిప్ పేరుతో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసింది. మొత్తం 285.17 ఎకరాల భూమిలో 1,327 ప్లాట్లు వేసి విక్రయించారు. అమరావతి టౌన్‌షిప్ మినహా 162.81 ఎకరాల భూమి ప్రసుత్తం ఉడా ఆధీనంలో ఉంది.
భారీగా స్థిరాస్తులు : ఉడా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.500 కోట్లు పైనే ఉంటాయి. సుమారు రూ.160 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు అన్ని జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయి. వీటి ద్వారా నెలకు ఉడాకు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వడ్డీ వస్తుంది. స్థిరాస్తులు కూడా బాగానే ఉన్నాయి. గురునానక్ కాలనీలో ఉడాకు రూ.4.5 కోట్ల విలువైన 1,125 చదరపు గజాల స్థలం ఉంది. పాయకాపురం లేఅవుట్‌లో మిగిలిన 14 ప్లాట్ల విలువ కూడా రూ. 2 కోట్లకు పైగానేఉంది. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో తొమ్మిది ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారు రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటితో పాటు విజయవాడ, గుంటూరు, తెనాలి, ప్రాంతాల్లో ఉడాకు సొంత భవనాలు ఉన్నాయి.
రూ.160 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
సిర్థాస్తులతోపాటు ఉడా వద్ద నగదు నిల్వలు భారీగానే ఉన్నాయి. ఈఏడాది ఉడా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి రూ.160 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై ఏటా సగటున రూ.12 కోట్ల వరకు వడ్డీ వస్తుంది. ఇవికాక వివిధ సేవలకుగాను ప్రతి ఏటా రూ.20 కోట్ల ఆదాయం వస్తుంది. వీటితోపాటు ప్లాన్ల మంజూరు, ఇతర సేవలకు గానూ ఉడాకు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల నుంచి ఏటా ఫీజులు వస్తుంటాయి. విజయవాడ నగరపాలకసంస్థ 1992 నుంచి ఉడాకు రూ.70 కోట్లు బకాయి పడింది.
ఉద్యోగుల్లో టెన్షన్.. సీఎంను కలవాలని నిర్ణయం
ఉడా రద్దు నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉడాలో ప్రస్తుతం 57 మంది పర్మినెంట్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు డ్రైవర్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్ ఇలా రకరకాల పోస్టుల్లో 58 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉడా ఆస్తులన్నీ సీఆర్‌డీఏకు బదలాయించినప్పుడు సిబ్బందిని ఎందుకు బదలాయించరని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఎన్జీవో సంఘ నేతల్ని కలిసి తమకు మద్దతుగా నిలవాలని కోరారు.
వివిధ రాజకీయ పార్టీల నేతల్ని కూడా కలుస్తున్నారు. ఉడాలో ఉన్న 70 మంది వరకు పింఛనుదారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉడా ఉద్యోగులకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలో స్థానం ఉండదని పరోక్షంగా సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రకటించారు. నైపుణ్యం ఉన్నవారికే సీఆర్‌డీఏలో చోటు ఉంటుందని ప్రకటించి ఆసక్తి ఉన్న వారు బయోడేటాలు ఇవ్వాలని కోరారు. ఉడా ఉద్యోగులు ఇంతవరకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. మంగళవారం జారీచేసిన ఆరు జీవోల్లో ఉడా సిబ్బంది గురించి ఎక్కడా కనీస ప్రస్తావన లేదు.
ఈ క్రమంలో మరో రెండు, మూడు రోజుల్లో విడుదలయ్యే సీఆర్‌డీఏ సర్వీసు రూల్స్‌లో ఉడా ఉద్యోగుల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. ఉడా ఉద్యోగుల్ని మున్సిపల్ శాఖకు, తిరుపతిలో తుడా, విశాఖపట్నంలోని పట్టణాభివృద్ధి సంస్థకు మార్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ మూడు పట్టణాభివృద్ధి సంస్థలే ఉన్నాయి. నెల్లూరు కేంద్రంగా మరో పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించే అవకాశం ఉంది. లేని పక్షంలో అక్కడికైనా మార్చే అవకాశం ఉంది.
సీఆర్‌డీఏలోని సీసీఎల్ నుంచి 27 మంది డెప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ విబాగం నుంచి సుమారు 50 మంది తహశీల్దార్లు, రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, దేశంలోని పలు పట్టణాభివృద్ధి సంస్థల నుంచి ప్లానింగ్ విభాగం సిబ్బంది డెప్యూటేషన్‌పై మరో వారం వ్యవధిలో రానున్నారు. ఈ క్రమంలో ఉడాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు సీఆర్‌డీఏలో చోటు దక్కడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉడా ఉద్యోగులు తమ భవితను తేల్చాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవాలని నిర్ణయించారు.