
రిమాండ్‌కు సీఏ సాయిబాబు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావులకు సన్నిహితుడు, వారి సంస్థలకు ఆర్థిక సలహాదారుడిగా చెప్పుకునే చార్టర్డ్ అకౌంటెంట్ వైఎస్‌ఎస్ సాయిబాబును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు బుధవారం అరెస్టు చేశారు.
సాక్షి, నరసరావుపేట/హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావులకు సన్నిహితుడు, వారి సంస్థలకు ఆర్థిక సలహాదారుడిగా చెప్పుకునే చార్టర్డ్ అకౌంటెంట్ వైఎస్‌ఎస్ సాయిబాబును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లక్ష్మణ్ పేపర్ మిల్స్ సంస్థ చేసిన రూ.12 కోట్ల మోసం కేసులో ఆ సంస్థ డెరైక్టరయిన సాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. బుధవారం అరెస్టు అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా వచ్చేనెల 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
ఇలావుండగా, సాయిబాబుకు టీడీపీతో ఎటువంటి సంబంధాలు లేవంటున్న ఆ పార్టీ నేతల మాటలు అవాస్తవాలేనని తేలింది. గుంటూరుజిల్లా నరసరావుపేట పట్టణంలోని బరంపేటకు చెందిన సాయిబాబు కుటుంబం టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఆయన తండ్రి రామారావు హెడ్‌మాస్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అనంతరం టీడీపీ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన సంస్థలకు పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తూ, వ్యాపార లావాదేవీల్లో సైతం భాగస్వామిగా చేరారు. పట్టణంలోని ఒకప్పటి సత్యనారాయణ టాకీస్, పువ్వాడ హాస్పిటల్ స్థలాన్ని కోడెల కుటుంబీకులు, సాయిబాబు భార్య పావని భాగస్వాములుగా కొనుగోలు చేసి 2004లో విక్రయించారు. టీడీపీ పెద్దలతో సైతం సాయిబాబు మంచి పరిచయాలు ఏర్పరుచుకున్నారని స్థానికులు చెబుతున్నారు.