ఓవైపు ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న నక్కలగండి( డిండి బ్యాలెన్సింగ్) రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయడం.. మరో వైపు ముంపు పరిహారం విషయంలో బాధితులు చేస్తున్న పోరుకు స్పందించిన మంత్రులు స్పష్టమై హామీ ఇవ్వడం.. ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేయడం.. ఆదివారం దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన మంత్రుల పర్యటలో ఇవన్నీ ఆవిష్కృతమయ్యాయి. భారీనీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. జానారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ముంపుబాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు.
దేవరకొండ, న్యూస్‌లైన్ : నక్కలగండి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రుల ఎదుట ముంపుబాధితులు తమ గోడును వినిపించారు. ఒక్కొక్కరి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ అక్కడికక్కడే ఉన్నతాధికారులకు మంత్రులు సూచించారు. రెండు, మూడు రోజుల్లో తమకు నివేదిక పంపాలని ఆదేశాలిచ్చారు.
సాక్షి కథనానికి స్పందన
నక్కలగండి రిజర్వాయర్ నిర్మాణంలో భూని ర్వాసితులకు పరిహారం అందనివైనంపై ‘పరిహారమేలేదు.. ప్రారంభమా?’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి మంత్రులు సుదర్శన్‌రెడ్డి, జానారెడ్డి స్పందించారు. పరిహారం విషయంలో మొదట సర్వే చేసిన అధికారులు డీఅండ్‌డీడీ, జాయింట్ ఇన్‌స్పెక్షన్ అయిన తర్వాత ఎండిపోయిన బత్తాయి చెట్ల విషయంలో పరిహారాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మంత్రి సుదర్శన్‌రెడ్డి భూసేకరణ అధికారి నిరంజన్‌తో మాట్లాడారు. పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
గతంలో రిజర్వాయర్ కట్ట నిర్మాణానికి సేకరించిన 225 ఎకరాల భూమికి పరిహారాన్ని బలవంతంగా ఇవ్వడంపై రైతులు, స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ అభ్యంతరం చెప్పారు. దీంతో స్పందించిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ..భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమికి పరిహారం తీసుకున్న తరువాత దానికి కొత్త భూసేకరణ చట్టం వర్తించదని పేర్కొనడంతో పాటు రెండు సార్లు ముంపునకు గురైన రైతుల విషయంలో మినహాయింపులుంటాయన్నారు. ఈ విషయమై రైతులకు న్యాయం జరిగేలా చూడాలని భూసేకరణ అధికారులను కోరారు.
భూములు కోల్పోవడంతో పాటు సీపెజ్ (రిజ ర్వాయర్ వల్ల వచ్చే జాలు నీళ్లు) కారణంగా ఇళ్లల్లో ఉండడానికి వీల్లేని పరిస్థితులుంటాయని రైతులు మొరపెట్టుకోవడంతో స్పందించిన మంత్రి జానారెడ్డి.. ఈ విషయంలో దుగ్యాలను ఉదాహరణగా తీసుకుంటామన్నారు. రూ. 50 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు కానీ ఆ ఆవాస ప్రాంతాలకు తప్పకుండా పునరావాసం కల్పిస్తామన్నారు. రెండు రోజుల్లోనే ఆవాసాల పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను, భూసేకరణ అధికారులను ఆదేశించారు.
చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మూడు గ్రామాలకు కృష్ణానది నుంచి మోటార్ల ద్వారా జలాలను అందించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని మంత్రి జానా హామీ ఇచ్చారు.
ముంపు మురిపెం
Published Mon, Feb 17 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement