పోలీసుల అదుపులో దేవరకొండ సుధీర్‌ ! - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో దేవరకొండ సుధీర్‌ !

Published Mon, Nov 6 2023 12:16 AM

- - Sakshi

 నెల్లూరు(క్రైమ్‌): కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ అలియాస్‌ అజయ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య స్థావరంలో విచారిస్తున్నట్లు తెలిసింది. గత నెల 26వ తేదీన కావలి మద్దూరుపాడు వద్ద సుధీర్‌, అతని అనుచరులు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. ఈ ఘటనపై కావలి రూరల్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

గంటల వ్యవధిలోనే ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుధీర్‌తోపాటు మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సుధీర్‌ పూటకో సిమ్‌కార్డు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండడంతో అతనిని పట్టుకోవడం కష్టతరంగా మారింది. దీంతో పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితుడిని చైన్నెలో అదుపులోకి తీసుకుని రహస్య స్థావరానికి తరలించినట్లు సమాచారం.

సుధీర్‌, అతని అనుచరులు తక్కువ ధరకు బంగారం పేరిట పలువురిని మోసగించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత సోమవారం స్పందన కార్యక్రమంలో ముగ్గురు బాధితులు సుధీర్‌ మోసాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో సుధీర్‌ మోసాలపై సైతం క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. సుధీర్‌ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement