
సముద్రంలో యువకుడి గల్లంతు
ఉలవపాడు: సముద్రంలో యువకుడు గల్లంతైన ఘటన మండల పరిధిలోని కరేడు తీరంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కరేడు చైతన్యనగర్‌కు చెందిన శింగోతు హేమంత్ ఇటీవల ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాశాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు మిత్రులతో కలిసి తమ కాలనీకి అర కిలోమీటర్ దూరంలో ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లాడు. హేమంత్ అలల తాకిడికి లోపలికి వెళ్లిపోయాడు. స్నేహితులు గ్రామంలో సమాచారం అందించడంతో అక్కడివారొచ్చి వెతికారు. అయితే ఉపయోగం లేకుండా పోయింది. ఎస్సై అంకమ్మ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుమారుడు గల్లంతవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.