
కుటుంబానికి గ్రామ బహిష్కరణ
విడవలూరు: వరకట్న వేధింపుల నేపథ్యంలో సుగుణ ఆత్మహత్యకు కారకులైన కుటుంబానికి గ్రామ బహిష్కరణ విధిస్తూ మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార కాపులు చర్యలు తీసుకున్నారు. సుగుణ ఆత్మహత్య విషయాన్ని గ్రామ కాపులు తీవ్రంగా పరిగణించారు. ఆత్మహత్య చేసుకున్న సుగుణ పిల్లలకు గ్రామస్తులు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. కల్లాపి రంగు పొడిని నీటిలో కలిపి తాగి వివాహిత సుగుణ గురువారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ మేకల పోలయ్య, పెద్దకాపు కొండూరు చిరంజీవి, నడింకాపు అక్కయ్యగారి నరసింహం, చిన్నకాపు శ్రీహరికోట నాగభూషణం శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ గ్రామంలో ఒక ఆడ బిడ్డ ప్రాణాలు కోల్పోయేంతలా హింసించిన బుచ్చింగారి హరికృష్ణ, నాగూరు, నరసమ్మలను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు వాళ్ల నాన్న, తాతల పేరు మీద ఉన్న ఇల్లు, పొలం ఇతర ఆస్తులను బాండ్ రూపంలో అందించడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామంలో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే సుగుణ భర్త హరికష్ణ, మామ నాగూరు ఈ బెట్టింగ్‌ల్లో సుమారు రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నారని, ఆ డబ్బు కోసమే సుగుణను అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం విచారకమన్నారు. గ్రామంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు మా దృష్టికి వస్తే వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో దండోరా నిర్వహించి ఇకపై క్రికెట్ బెట్టింగ్‌లు జరగకుండా తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. పోలీసులు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్‌లపై నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో గ్రామంలోని కాపులతోపాటు, మత్స్య కార నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సుగుణ మృతికి కారకులపై
గ్రామ కాపులు చర్యలు
క్రికెట్ బెట్టింగ్‌లే సుగుణ మృతికి కారణం
తల్లిని కోల్పోయిన
పిల్లలకు గ్రామస్తుల అండ