
ఇద్దరు దొంగల అరెస్ట్
ఆత్మకూరు: ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేశామని ఆత్మకూరు సీఐ జి.గంగాధర్ తెలిపారు. తన కార్యాలయంలో గురువారం ఎస్సైలు ఎస్‌కే జిలానీ, బి.సాయిప్రసాద్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు మండలం దేపూరు గ్రామానికి చెందిన తూమాటి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు గతేడాది ఆగస్ట్ 13వ తేదీన సొంత పని నిమిత్తం జంగాలపల్లి గ్రామానికి వెళ్లింది. పని చూసుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో బస్‌షెల్టర్ వద్ద నిలబడింది. కోవూరు స్టౌ బీడీ కాలనీకి చెందిన పఠాన్ రహీం, దేవరకొండ శివ అనే పాత నేరస్తులు సోమశిల నుంచి మోటార్‌బైక్‌పై లక్ష్మమ్మ వద్దకు వచ్చారు. రేవూరుకు ఎలా వెళ్లాలని అడుగుతూ ఆమె మెడలోని సరుడు లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నెల్లూరుపాళెం వద్ద పఠాన్ రహీం, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పఠాన్ రఫీ అనే ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్సై ఎస్‌కే జిలానీ వారిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణలో పఠాన్ రహీం అప్పట్లో వృద్ధురాలి మెడలో సరుడును శివతో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించాడు. మరో దొంగతనం చేసేందుకు రఫీతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చానన్నాడు. శివ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.