
సోమశిల హైలెవల్ కెనాల్‌కు కేబినెట్ అనుమతి
ఆత్మకూరు : జిల్లాలోని మెట్ట నియోజకవర్గాలైన ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు అందించేందుకు ఏర్పాటు కానున్న సోమశిల హైలెవల్ కెనాల్‌కు రాష్ట్ర కేబినెట్ అనుమతి ఇచ్చిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ నేత నాగులపాటి శ్రీనివాసులురెడ్డి నివాసంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ కాలువ ద్వారా ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో బీడు భూములు
సాగు భూములుగా మరే అవకాశం ఉందన్నారు. ఎంతో కాలంగా మెట్ట రైతులు ఈ హైలెవల్ కాలువ కోసం నిరీక్షిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కొనసాగితే జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, రాపూరు, కావలి ప్రాంతాలు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలు ఉత్తరాంచల్ రాష్ట్రానికి వెళ్లి పెట్టుబడులు పెడుతున్నారని, అదే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కొనసాగితే ఎందరో పారిశ్రామిక వేత్తలు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికరణ అభివృద్ధికి ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటీవల పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే మౌలిక వసతులపై కూడా ఈ ప్రాంతంలో కొంత పరిశీలన జరిగిందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సోమశిల అధికారులతో మాట్లాడి ఐఏబీ సమావేశంలో తీర్మాణించేలా కృషి చేస్తామన్నారు. ఎంపీ నిధులు అధిక శాతం రూ.5 కోట్ల మేర తాగునీటి అవసరాలకే వెచ్చించామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి రూ.1.04 కోట్లు, ఉదయగిరి నియోజవర్గానికి రూ.1.05 కోట్లు, కావలికి రూ.78 లక్షలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాగునీటి అవసరాల కోసం ఈ నిధులు వెచ్చించామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా తాగునీటి అవసరాలు తీర్చేందుకు జెడ్పీ ద్వారా కూడా కృషి చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మెట్ట ప్రాంతంలోనే గాక డెల్టా ప్రాంతాల్లో కూడా బోర్లు కోసం ప్రతిపాదనలు వస్తున్నాయని తెలిపారు. బోగోలు మండలంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు కూడా కలెక్టరు ఆదేశించారన్నారు. ప్రధానమైన సమస్యలు, ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ నిధులతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం వారు జిల్లాలో అమలు అవుతున్న పింఛన్ల పరిశీలనపై ఆరా తీశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, ఎంపీపీ సిద్ధం సుష్మ, మాజీ ఎంపీపీ డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు నాగులపాటి శ్రీనివాసులురెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సలర్ నాగులపాటి విజయలక్ష్మి పాల్గొన్నారు.