కేంద్రం ఇచ్చిన రాజధాని నిధులు ఖర్చు చేయలేదు : కాగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకే కాదు.. కేంద్రానికీ తప్పులు లెక్కలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం టోకరా వేసినట్లు కాగ్ వెల్లడించింది. 2016 మార్చితో ముగిసిన సంవత్సరానికి కాగ్ నివేదికలో కేంద్రానికి తప్పుడు వినియోగ పత్రాలను పంపించడం, కేంద్రం రాజధాని కోసం ఇచ్చిన నిధులను వ్యయం చేయకపోవడం వంటి అంశాలను కాగ్ ఎత్తిచూపింది.
► కొత్త రాజధానిలో రాజ్‌భవన్, అసెంబ్లీ నిర్మాణం కోసం కేంద్రం 2015 మార్చిలో రూ. 500 కోట్లను విడుదల చేయగా 2016 మార్చిలో ఈ నిధులను ఏపీసీఆర్‌డీఏకు విడుదల చేశారు. ఆ సంస్థ ఈ నిధులను వినియోగించలేదు. రాజధాని ప్రాంతంలో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కోసం 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ. 1,000 కోట్లను విడుదల చేసింది. అయితే కేంద్రం విడుదల చేసిన ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు ఆ నిధులు విడుదల చేసినా వ్యయం చేయలేదు.
► రాజధాని ప్రాంతంలో భూ సమీకరణతో భూమిని కోల్పోయిన ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం పదేళ్ల పాటు నెలకు రూ. 2,500 చొప్పున పింఛను అందచేయాలి. ఈ పథకం కింద 23,500 భూమిలేని కుటుంబాలను గుర్తించారు. అయితే సీఆర్‌డీఏ 19,075 కుటుంబాలకు మాత్రమే రూ. 55.73 కోట్లు వ్యయం చేసి నెలవారీ పింఛన్లు చెల్లిస్తోంది. మిగిలిన 4,425 కుటుంబాలకు పింఛన్లు చెల్లించకపోవడానికి కారణాలు తెలప లేదు.
► రాష్ట్ర ఫైనాన్షియల్ కోడ్‌కు విరుద్ధంగా ప్రభుత్వ ఖాతా నుంచి రూ. 345.98 కోట్లను పీడీ ఖాతాల నుంచి తీసి వివిధ బ్యాంకు ఖతాలలో జమ చేశారు. సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల కు రూ. 252.31 కోట్లకు వినియోగ ధ్రువపత్రా లను తీసుకోకపోవడాన్ని కాగ్ తప్పుపట్టింది.
తప్పుడు లెక్కలతో టోకరా
Published Sat, Apr 1 2017 1:41 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement