
సిక్కోల్లో కాల్ అంబులెన్స్
► రాష్ట్రంలో తొలిసారి సిక్కోల్లోనే అమలు
►యాప్‌ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
►తగిన శిక్షణతో క్షతగాత్రులకు తక్షణ సేవలు
శ్రీకాకుళం సిటీ: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెచ్చు మీరుతున్నాయి. పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు గల జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలకు గురవుతున్న వారు సకాలంలో వైద్య సాయం అందక మృత్యుకోరల్లోకి వెళ్తున్నారు. ఇకపై ఈ ఇబ్బంది ఉండకూడదని పోలీసులు కొత్త యాప్‌ను సిక్కోల్లో కాల్ అంబులెన్స్ తీసుకువచ్చారు. ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ చొరవతో కాల్ అంబులెన్స్ అనే యాప్ రాష్ట్రంలోనే తొలిసారిగా సిక్కోలులో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ యాప్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.
తక్షణ సాయం కోసం..
కాల్ అంబులెన్స్ సాయంతో ఆండ్రాయిడ్ మొబైల్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అత్యవసర స్థితిలో అందుబాటులోకి వస్తాయి. ఏ ప్రమాదం సంభవించినా, జిల్లాలో ఎక్కడ ఘటన జరిగినా ఈ యాప్ సాయంతో క్షణాల్లో అత్యవసర వైద్యసేవల వాహనం సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. సమీపంలో ఉన్న ఆస్పత్రి వైద్యులను అప్రమత్తం చేయడంతో పాటు ముందుగానే క్షతగాత్రుని రక్తగ్రూపులను సిద్ధం చేస్తుంది. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కాల్ అంబులెన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడమే అని పోలీసులు చెబుతున్నారు. ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న కాల్ అంబులెన్స్ యాప్‌లో ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్‌తో పాటు నివాసిత ప్రాంతం తదితర వివరాలను పూరించాలి. ఉదాహరణకు శ్రీకాకుళం నగరానికి చెందిన వ్యక్తికి ఇచ్ఛాపురంలో ప్రమాదం జరిగితే.. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉంటే సమీపంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయి. అంబులెన్స్‌ల పరిస్థితి. ఆస్పత్రుల్లో ఉన్న రక్తనిల్వలు, ఆస్పత్రిలో ఉన్న వైద్యుని నుంచి అందరి ఫోన్ నంబర్లు కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. అతికొద్ది సమయంలోనే ప్రమాదం బారిన పడిన వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకోండి..
రహదారిపై ప్రయాణిస్తున్న, వెళ్తున్న సందర్భాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ముందుకు వచ్చేవారు కారు. ఏమైనా పో లీస్ కేసులు అవుతాయేమోనన్న సందేహాలు అందరిలో గతంలో ఉండేవి. దీంతో చాలా మంది ప్రమాద బాధితులను కాపాడడానికి ముందుకు వచ్చే వారు కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఈ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నారు. వారికి బ్యాడ్జీలను కూడా ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో ఎవరు గాయపడినా సమీపంలో ఆస్పత్రికి నిర్భయంగా చేర్చి వారి ప్రాణాలను కాపాడాలని సూచిస్తున్నారు.
వినియోగించుకోండి
రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో అమలుచేయనున్న కాల్ అంబులెన్స్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ, అర్బన్ ప్రాంత యువత ముందుకు రావాలి. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలో ఆ స్పత్రికి తీసుకువచ్చి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేం దుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తగిన శిక్షణను ఇస్తాం. వారికి బ్యాడ్జీలను కూడా ఏర్పాటుచేస్తాం. ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయపడేందుకు ముందుకు రావాలి.
– సీఎం త్రివిక్రమ వర్మ, ఎస్పీ