సీఐను పట్టించిన కాల్ డేటా | Call the data which had siainu | Sakshi
Sakshi News home page

సీఐను పట్టించిన కాల్ డేటా

Published Mon, Dec 29 2014 7:37 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

సీఐను పట్టించిన కాల్ డేటా - Sakshi

సీఐను పట్టించిన కాల్ డేటా

  • సీఐ జీవీ రమణ పాత్రపై పక్కా ఆధారాలు
  • ప్రత్యేక ఆపరేషన్‌తో వెలుగుచూసిన వాస్తవాలు
  • సాక్షి, విశాఖపట్నం : త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ లంచావతారాల్లో సీఐ జి.వి.రమణ పాత్రపై పక్కా ఆధారాలు ఉన్నతాధికారులకు లభ్యమయ్యాయి. ప్రత్యేక ఆపరేషన్‌లో అతడి ఫోన్ సంభాషణలే పట్టిచ్చాయి. దీంతో అతడితోపాటు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఉన్నతాధికారులు చేసిన జాయింట్ ఆపరేషన్‌లో వెలుగుచూసిన అంశాలు. ఆర్కే ఫ్యామిలీ స్టోర్స్ యజమానులు దినేష్‌మోడీ, రాజ్‌కుమార్‌మోడీలు పాండ్య అనే స్థిరాస్తి వ్యాపారికి మూడేళ్ల క్రితం ఫ్లాట్ కొనుగోలుకు రూ.15 లక్షలు ఇచ్చారు. తర్వాత అతను అదృశ్యమయ్యాడు.

    ఇటీవల నగరానికి వచ్చాడని తెలిసి తమ దుకాణంలో పనిచేసే వారితో కలిసి వెళ్లి దినేష్, రాజ్‌కుమార్ అతడిని గట్టిగా నిలదీశారు. దీంతో పాండ్య మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు సీఐ జీవీ రమణ వద్దకే వెళ్లింది. ఆయన ఎస్‌ఐ రామారావుకు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. ఇంత వరకూ సజావుగానే జరిగింది. అనంతరం పాండ్యపై దాడి చేసినందుకు గానూ రౌడీషీట్ తెరుస్తామంటూ దినేష్‌మోడీని బెదిరించడం ప్రారంభించారు.

    అతను అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పొందినా వీరి బెదిరింపులు ఆగలేదు. పైగా రూ. 1.5 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో దినేష్ ఏసీబీని ఆశ్రయించి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను పట్టించారు. తనను వేధించిన వారిలో సీఐ కూడా ఉన్నట్లు దినేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తెరవెనుక సూత్రధారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఏసీబీ డీఎస్పీ నరసింహారావుతో ఇన్‌చార్జి సీపీ అతుల్‌సింగ్ మాట్లాడారు.

    ఇద్దరు అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి సీఐ పాత్రపై ఆధారాలు సేకరించారు. సీఐ రమణ మాట్లాడిన ఫోన్‌కాల్స్ రికార్డ్, బాధితులతో మాట్లాడినప్పుడు చేసిన వాయిస్ రికార్డులు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏసీబీ డీఎస్పీని వివరణ కోరగా కాల్ రికార్డ్స్ లభించిన మాట వాస్తమేన్నారు. మరోవైపు మిగతా కేసుల్లోనూ సీఐలు, ఇతర అధికారుల పాత్రపైనా ఉన్నతాధికారులు, ఏసీబీ దృష్టి సారిస్తోంది. వారి కాల్ డేటా రికార్డ్స్‌ను రహస్యంగా క్రోడీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement