ష్...
- ప్రచారానికి తెర
- పోటాపోటీగా సాగిన క్యాంపెయిన్
- గెలుపుపై ఎవరి ధీమా వారిదే
- ఇక ఓటరు తీర్పే తరువాయి..
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం పరిసమాప్తమైంది. హోరెత్తిన మైకులు.. పరుగెత్తిన బైకులు.. జైకొట్టిన చేతులు.. అలసిపోయి విశ్రాంతికి ఉపక్రమించాయి. నిప్పులు చెరుగుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రధాన పార్టీలు మొదలుకొని స్వతంత్ర అభ్యర్థుల వరకు ఎవరికి వారు గెలుపు తమదే అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ‘తాము అధికారంలోకి వస్తే...’ అంటూ హామీల వర్షం కురిపిం చారు.
హైదరాబాద్ మహానగరాన్ని అందలమెక్కించారు. అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడతామన్నారు. చిన్న చిన్న గల్లీలు, బస్తీలు మొదలుకొని కాలనీలు, అపార్టుమెంట్‌లు, అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఒక మహాజాతరను తలపించింది. రంగురంగుల జెండాలు రెపరెపలాడాయి. ప్రదర్శనలు, బహిరంగసభలు, నినాదాలు హోరెత్తించాయి.
గ్రేటర్‌లోని మూడు పార్లమెంటరీ స్థానాలకు, 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరో 24 గంటల్లో జరగనున్న ఎన్నికలు హేమాహేమీల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నాయి. రాత్రింబవళ్లు ప్రచారంలో తలమునకలై, ఓటర్లను ఆకట్టుకొనేందుకు అనేక రకాలుగా ప్రయత్నించిన అభ్యర్థులు.. ఇప్పుడు ఆ ఓటరు మహాశయుడిపైనే భారం వేసి ఊపిరి తీసుకున్నారు.
మరోవైపు వివిధ రకాల సమీకరణాలు, గెలుపోటములను ప్రభావితం చేసే అంచనాలు, విశ్లేషణలతో ఎవరికి వారు ఈ ఎన్నికల్లో గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. కొన్నిచోట్ల రెండు ప్రధానమైన పార్టీలు పోటీ పడుతుండగా, మరికొన్నిచోట్ల మూడు, నాలుగు పార్టీల మధ్య, బహుళ పార్టీల మధ్య పోటీ నెలకొంది.