హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ప్రైవేటు పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 5వేల సీట్లు మిగిలాయి. వీటిని ఆయా కళాశాలల యజమానులు కన్వీనర్ కోటా ఫీజులపై ఈ నెల 31 వరకు భర్తీ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓయూసెట్-2013 ప్రవేశ పరీక్ష రాయకున్నా డిగ్రీలో 50 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఆయా ప్రైవేటు పీజీ కళాశాలల కోర్సుల్లో ప్రవేశం పొందే వెసులుబాటును అధికారులు కల్పించారు.
అయితే, ఇలా చేరే విద్యార్థులకు ఉపకార వేతనం రాదని చెప్పారు. భర్తీ అయిన సీట్ల వివరాల జాబితాను సెప్టెంబరు 3 వరకు ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో సమర్పించాలని జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ఆయా కాలేజీలకు సూచించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 1300 సీట్లు, ఎంకాం 500 సీట్లు, ఎమ్మెస్సీ గణితం 500 సీట్లు, ఎమ్మెస్సీ ఫిజిక్స్ 250 సీట్లు మిగిలిపోయినట్టు అధికారులు తెలిపారు.