మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామపరిధిలోని పేరూరు కాలవను తవ్వుతున్న దృశ్యమిది. ఈ కాలవ డీపీఆర్ పరిధిలో భూసేకరణ జరగలేదు. రైతులకు పరిహారం ఇవ్వలేదు. కానీ కాలవలు తవ్వేస్తున్నారు. పరిహారం ఇప్పించి పనులు ప్రారంభించేలా చూడాల్సిన మంత్రి, చిరునవ్వులు చిందిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. మంత్రి అండతో పనులు దక్కించుకున్న నిర్మాణసంస్థ ‘మెయిల్’ రైతుల అభిప్రాయాలతో పనిలేకుండా తవ్వకాలు చేపడుతోంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు జిల్లాలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం రైతులను ఎలా అన్యాయం చేస్తోందో చెప్పేందుకు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతలో అధికార పార్టీ నేతల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రైతుల పేరు చెప్పి ఆ రైతుల నోట్లోనే మట్టికొడుతున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పిందే శాసనం...అధికారులకు వారి మాటే శిరోధార్యం. భూసేకరణచట్టంతో పనిలేదు...రైతుల భవిష్యత్తుపై బాధ్యత లేదు...ప్రాజెక్టుల కాలువ నిర్మాణాలకు సంబంధించి గ్రామస్తుల అభ్యంతరాలు పట్టించుకోరు. తమకిష్టమొచ్చినట్లు చేసేస్తారు. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చినా, రైతులు, విపక్షపార్టీలు ఉద్యమించినా కాలవ నిర్మాణాల పేరుతో జరుగుతున్న ‘దౌర్జన్యకాండ’కు అడ్డుకట్టపడడంలేదు. చివరకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కూడా ‘చట్టం ఒకలా చెబుతుంటే ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తే ఎలా?’ అనే కనీస ఆలోచన చేయడం లేదు.
ఆ మూడు పనుల్లో వారు చెప్పిందే శాసనం
ఉరవకొండ నియోజకవర్గంలో రూ.244.72 కోట్లతో 36వ ప్యాకేజీ పనులు సాగుతున్నాయి. ఈ పనులను టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఇక్కడ భూసేకరణ జరగకుండానే పనులు చేస్తుండగా..రైతులు అడ్డుకున్నారు. వామపక్షపార్టీలు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అయినా శాసనమండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్ అండతోనే ఈ పనులు సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. కలెక్టర్, జేసీ కూడా ఈ దౌర్జన్యకాండను ఆపలేకపోయారు. ఇక ఇదే స్ఫూర్తితో పేరూరు పనులకు మంత్రి పరిటాల సునీత శంకుస్థాపన చేసి ప్రారంభించారు. గొరిదిండ్లలో పనులు మొదలయ్యాయి. ఇక్కడా ఇదే పరిస్థితి. ‘భూసేకరణ చట్టం’లోని అంశాలు ఎక్కడా అమలు చేయకుండా పనులు ప్రారంభించారు. అయినప్పటికీ నిర్మాణసంస్థ ‘మెయిల్’ పనులు యథేచ్ఛగా పనులు చేస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ నేతల పొలాల్లోనే మొదటగా పనులు చేపడుతున్నారు. కాలవ పనులు తవ్విన తర్వాత, సామాన్య రైతుల పొలాల్లో తవ్వాలనేది వీరి వ్యూహం. తోటిపొలంలో భారీగా కాలువ తవ్విన తర్వాత, రైతులు పరిహారం ఇవ్వకుండా తవ్వేది లేదని ధిక్కారస్వరం విన్పిస్తే పరిహారం అందడంలో సమస్యలు తలెత్తుతాయేమోనని, పెద్దోళ్లతో తమకు ఎందుకు, అందరికీ అందినంతే, అందినప్పుడే పరిహారం అందుతుందని గుండెలో బాధను దిగమింగుకుని అయిష్టంగా భూములు త్యాగం చేస్తున్నారు.
బీటీపీ ప్రాజెక్టు పనులకు నేడు సీఎం శంకుస్థాపన
36వ ప్యాకేజీ, పేరూరు పనులు వివాదస్పదంగా సాగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు బీటీపీకి నీళ్లిచ్చే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామసభలు, రేట్లు నిర్ధారణ, తదితర ప్రక్రియలు కొనసాగలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. భూసేకరణ జరగకుండానే మంత్రి పరిటాల సునీత పనులు ప్రారంభించి, అప్పుడప్పుడు పరిశీలనకు వస్తుండేవారు. నేడు మంత్రి కాలవ శ్రీనివాసులతో పాటు ఏకంగా సీఎం చంద్రబాబే వస్తున్నారు. ఈ పనులను ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ చేపడుతోంది. ప్రజలకు మేలు జరగాలని చేసిన చట్టాలని పరిరక్షించాల్సిన బాధ్యత మంత్రులు, ముఖ్యమంత్రులపై ఉంటుంది. వారే వాటిని ఉల్లంఘించి రైతుల పొట్టకొట్టే చర్యలకు ఉపక్రమిస్తుంటే, రైతులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో 36వ ప్యాకేజీ రూపంలో భూసేకరణ చట్టంతో పనిలేకుండా ప్రభుత్వం పనులు చేయడం ప్రారంభిస్తే...అది పేరూరు, బీటీపీ వరకూ వ్యాపించిందని, భవిష్యత్తులో అనంత– అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే, ఇతర ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణ విషయంలో కూడా ఇదే పంథా అవలంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా రైతు, ప్రజా, కుల సంఘాలతో పాటు విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ‘దౌర్జన్యకాండ’ను అడ్డుకోకపోతే భవిష్యత్తులో ‘అనంత’ రైతులు, ప్రజల భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదముంది.
రిజిస్ట్రేషన్ విలువ మేరకే పరిహామిస్తే రైతులకు నష్టం
బీటీపీ పనుల కోసం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 22 రెవెన్యూ గ్రామాలలో బీటీపీ, కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పనులకు ప్రభుత్వం భూములను గుర్తించింది. 1,117 మంది రైతులకు చెందిన 1130.51 ఎకరా>లు భూమి కాల్వకు అవసరమని అధికారులు నిర్ధారించారు. ఆయా రెవెన్యూ గ్రామాల పొలాలు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చాలా తక్కువగా ఉంది. మండల కేంద్రాల్లో ఎకరం రిజిస్ట్రేషన్ విలువ రూ.2 లక్షలు, గ్రామాల్లో రూ.1.20 లక్షలు ఉండగా.. ముదిగల్లు రెవెన్యూ పరిధిలో మాత్రం రూ.2.10 లక్షల మేర రిజిస్ట్రేషన్ విలువ పలుకుతోంది. దీని ప్రకారం భూసేకరణ నిబంధనలు పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ విలువ భూమికి అదనంగా వంద శాతం పరిహారం అందించే అవకాశాలున్నాయి. అంటే ఎకరం రిజిస్ట్రేషన్ విలువ రూ.2 లక్షలు పలికితే రైతుకు పరిహారం రూ.4 లక్షలకు మించి అందదు. ఎకరం రిజిస్ట్రేషన్ విలువ రూ.1.20 లక్షలు పలికితే నిబంధనల ప్రకారం ఎకరం రూ.2.40 లక్షలు అందుతుంది. దీనిని బట్టి చూస్తే లక్షలాది రూపాయలు విలువ చేసే భూములను ప్రభుత్వం, టీడీపీ పాలకులు దౌర్జన్యంగా గుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
భూసేకరణ చట్టం ఏం చెబుతోందంటే
2013–భూసేకరణచట్టం ప్రకారం ఒక ప్రాజెక్టుకు ఏదైనా భూమి అవసరమైతే ఎంత అవసరం అవుతుందో ప్రాజెక్టు చేపట్టే సంబంధిత నీటిపారుదలశాఖ డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్)ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలి. ప్రభుత్వం భూమిని సేకరించాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశిస్తుంది. డీపీఆర్ ఆధారంగా ప్రాజెక్టు చేపట్టే గ్రామాల్లో ఎక్కడ భూమి అవసరం ఉంది..? అది ప్రభుత్వ, ప్రైవేటు భూమా? అని సర్వే చేయించాలి. ఎన్ని ఎకరాలు అవసరం అవుతుందో లెక్కించాలి. ప్రభుత్వ ధరలతో సంబంధం లేకుండా బహిరంగ మార్కెట్లో ఎంత ధర పలుకుతుందో లెక్కించి, దానికి అదనంగా ధరను నిర్ణయించాలి. ధర నిర్ణయించిన తర్వాత భూమి కోల్పోయే గ్రామాలన్నిటిలో జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించాలి. అందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ధరలపైన, కాలవ వెళ్లే మార్గాలపైన అభ్యంతరాలుంటే పరిగణలోకి తీసుకోవాలి. అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి, ఆపై రైతులు, గ్రామసభ ఆమోదం తెలిపినట్లు గ్రామస్తులు, రైతులతో సంతకాలు తీసుకోవాలి. తర్వాత జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ తర్వాత కూడా అభ్యంతరాలు ఉంటే పరిగణలోకి తీసుకోవాలి. చివరగా రైతులకు పరిహారం ఇవ్వాలి. పరిహారం అందిన తర్వాత భూములు ప్రభుత్వానికి అప్పగించినట్లు రైతులు డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తారు. దీంతో భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత భూమిని నిర్మాణసంస్థకు అప్పగించాలి. పనులు ప్రారంభించాలి. ఇందులో ఏ ఒక్క ప్రక్రియ జిల్లాలో జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment