చెరకు రైతుల గోడు | cane crop farmers problems | Sakshi
Sakshi News home page

చెరకు రైతుల గోడు

Published Mon, Sep 1 2014 4:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

చెరకు రైతుల గోడు - Sakshi

చెరకు రైతుల గోడు

- కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలు
- కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు
- పట్టించుకోని అధికారులు
సాక్షి, నెల్లూరు : ఆరుగాలం కష్టపడి చెరకు పండించిన రైతులకు షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాల ైవె ఖరి శాపంగా మారింది. పంటను ఫ్యాక్టరీకి తరలించి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులపాలయ్యారు. తమకు రావల్సిన మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కరువవుతోంది. ఫ్యాక్టరీల యాజమాన్యాలతో పాటు అధికారులకు కూడా రైతుల కష్టాలు పట్టడం లేదు. న్యాయం చేస్తామని సాక్షాత్తు కలెక్టర్ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు.

కోవూరు ఫ్యాక్టరీ పరిధిలో పాతబకాయిలు కొంత మాత్రమే చెల్లించి మిగిలినవి పెండింగ్‌లో పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలోని ఎన్‌సీఎస్ షుగర్  ఫ్యాక్టరీ పరిధిలో 2012-13కి సంబంధించి రైతులకు రూ.12.90 కోట్లు రావాలి. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రైతులు రెండేళ్లుగా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాకు చెందిన రైతులే కాక వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన రైతులకు కూడా బకాయిలు చెల్లించాలి.

వీరు పలుమార్లు కలెక్టర్ శ్రీకాంత్‌ను కలిసినా ఫలితం కరువైంది. ఈ ఫ్యాక్టరీపై గతంలో అధికారులు ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగించి రూ.25 లక్షల మేర రికవరీ చేశారు. గత ఏడాది రైతులే యూనియన్‌గా ఏర్పడి ఫ్యాక్టరీని నడిపించారు. పాత బకాయిలు చెల్లించినా 2012-13కి సంబంధించిన బకాయిలు మాత్రం అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో స్టే కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలాఖరుకు రూ.2 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఇది వరకే ఆదేశించింది. అయితే ఈ కేసు ఎప్పటికి పూర్తయి, తమకు ఎప్పుడు నగదు అందుతుందోనని రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
 
నాయుడుపేటలోని ఎంపీ షుగ ర్స్ 2013-14 సంబంధించి రైతులకు రూ.9.59 కోట్ల బకాయిలు చెల్లిం చాలి. వీటి కోసం రైతులు ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నా యాజమాన్యం నుంచి స్పందన కరువైంది. కోవూరు సహకార చక్కెర కర్మాగారానిది ఇదే పరిస్థితి. రెండేళ్లుగా రైతులకు రూ.7 కోట్లకు పైగా చెల్లించాలి. బకాయిలు చెల్లించాలంటూ రైతులు ఫ్యాక్టరీతో పాటు కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ప్రభుత్వం కనికరించకపోవడంతో గత ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిపేశారు. బకాయిలకోసం రైతులు పదేపదే ఆందోళనలకు దిగడంతో ఎట్టకేలకు ప్రభుత్వం టన్నుకు రూ.1,760 వంతున 89 వేల టన్నులకు సంబంధించి రూ.6 కోట్లు చెల్లించింది.

అంతకు ముందు ఏడాది టన్నుకు రూ. 2,150 చెల్లించి, తర్వాత సంవత్సరం కేవలం రూ.1,760 చెల్లించడంపై  రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం టన్నుకు రూ.1,960 చొప్పున చెల్లించాలని ప్రతిపాదనలు పంపారు. ఈ లెక్కన అయినా ఇంకా రూ.1.70 కోట్లు రైతులకు చెల్లించాలి. ఇవి ఎప్పటికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement