ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలి: వైఎస్ జగన్ | Capital of decision to benefit should happen for people: YS Jagan Mohan reddy | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలి: వైఎస్ జగన్

Published Thu, Sep 4 2014 2:01 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలి: వైఎస్ జగన్ - Sakshi

ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలి: వైఎస్ జగన్

* రాజధానిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* కొందరు శ్రీమంతులకే పరిమితమయ్యేలా రాజధాని ఉండకూడదు
* రాజధాని ప్రకటనకు ముందే దానిపై చర్చ, ఓటింగ్ జరగాలి
* ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించేదేముంటుంది?
* నేను చేసేది చేసేస్తా... మీ చావు మీరు చావండి అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఖరి ఉంది
* ఒకే చోట కనీసం 30 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రాజధాని నిర్మించాలని మేం ముందునుంచీ చెబుతున్నాం
* కృష్ణా - గుంటూరు జిల్లాల్లో రాజధానికి నేనూ సిద్ధమే.. అక్కడ 30 వేల ఎకరాల వైశాల్యం గల భూమి ఒకే చోట ఉంటే అక్కడే పెట్టమనండి
* శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుకుంటున్నాం
* ఆ నివేదికలో ఏముందో తెలియకుండా, తెలుసుకోవాలనే బుద్ధీ జ్ఞానం లేకుండా రాజధానిపై ప్రకటనకు  ముహూర్తం కూడా నిర్ణయించారు

 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రజ లందరికీ మేలు జరిగేలా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటు కొందరు శ్రీమంతులకే పరిమితమయ్యేలా ఉండకూడదని తెలిపారు. బుధవారం శాసన సభ వాయిదా పడిన తర్వాత జగన్ అసెంబ్లీలోని తన చాంబర్‌లో మీడియాతో ముచ్చటిం చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో ముడివడి ఉన్నందున ప్రకటన చేయడానికి ముందే ఆ అంశంపై చర్చ, ఆ తర్వాత ఓటింగ్ జరగాలని కోరుతున్నామని చెప్పారు. రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించేదేముంటుందని ప్రశ్నించారు. ‘‘1953 జూలై 1న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడుండాలనే అం శంపై అప్పట్లో 5 రోజులపాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది.
 
 మెజారిటీ శాసన సభ్యులు ఓట్లేశారు. ఆ ప్రకారమే రాజధాని నిర్ణ యం జరిగింది. అలా కాకుండా ఒక నియంత మాదిరిగా రాజధాని ఎక్కడుండాలో ఆయనే నిర్ణయించేస్తానంటే ఎలా? ఈరోజు అష్టమి బాగాలేదు. దశమి రోజున ప్రకటన చేసేస్తానం టే సరిపోతుందా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా’’ అని జగన్ ప్రశ్నించారు. ‘‘ముందు రాజధానిపై ప్రకటన చేస్తాను. ఆ తరువాత చర్చించండి అంటున్నారు. ప్రకటన ఇచ్చాక ఇక చర్చించేదేముంటుంది? నేను చేసేది చేసేస్తా... మీ చావు మీరు చావండి అన్నట్లుగా సీఎం వైఖరి ఉంది’’ అని జగన్ ఘాటుగా విమర్శించారు. ‘‘రాజధా నికి కావాల్సిన భూమి ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ నిర్మిస్తే బాగుంటుందని మేం తొలి నుంచీ చెబుతున్నాం. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూమి లేదా అటవీ భూమినైనా సరే లక్ష ఎకరాల వరకు డీనోటిఫై చేస్తామని కేంద్రం రాష్ట్ర విభజన చట్టంలోనే చెప్పింది. అలాంటప్పుడు అందుకు భిన్నంగా ఆలోచన చేయడమేమిటి? ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో 2 వేల ఎకరాలు, 3 వేల ఎకరాలు తీసుకుని అక్కడే రాజధాని పెడతామంటే ఇక ఆ చుట్టుపక్కల స్థలాలు, ఇళ్ల ధరలు ఏ స్థాయికి వెళ్లిపోతాయో ఆలోచించండి.

ఒక సామాన్యుడు చదువుకున్న తన పిల్లలను తీసుకుని ఉద్యోగాల కోసం రాష్ట్ర రాజధానికి వెళ్లి ఉండాలంటే అతనికి అందుబాటులో ఉండే ధరకు అద్దెకు ఇల్లు దొరుకుతుందా? మీలాంటి ఓ ఉద్యోగి (జర్నలిస్టులనుద్దేశించి) ఉద్యోగం చేసుకోవడం కోసం రాజధానికి వెళ్లి సొంత ఇల్లు కావాలనుకుంటే కొనడం సాధ్యమయ్యే పనేనా!’’ అని జగన్ అన్నారు. ఎవరికో మేలు చేసే ఆలోచనలతో అదే డెరైక్షన్‌లో వెళితే ఎలా? రాష్ట్రానికి ఏం చేస్తే మేలు జరుగుతుందో అది చేయాలి’’ అని జగన్ చెప్పారు. భూసేకరణ చేసి.. ఆ భూమిని అభివృద్ధి చేసి 40 శాతం తిరిగి సొంతదారునికే ఇస్తానని ప్రభుత్వం చెబుతోంది కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘నిజమే.. ఆ తరువాత ఆ భూమి ని యజమాని మీలాంటి వారికి తక్కువ ధరకు అమ్ముతాడా? గజం ఏ యాభై వేల రూపాయలకో విక్రయిస్తాడు కదా..! సామాన్యుడు అంత భారీ ధరకు కొనగలడా..’’ అంటూ జగన్ అందులో ఇమిడి ఉన్న సమస్యను వివరించారు.
 
ఇడుపులపాయ అని నేనన్నానా?
 ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని జగన్ కోరుకుంటున్నారని అధికారపక్షం అరోపిస్తోం దని మరో విలేకరి అనగా.. ‘‘ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని నేను అన్నానా? ఇలాంటివన్నీ వారు (టీడీపీ) అక్కసుతో చేసే విమర్శ లు’’ అని జగన్ సమాధానమిచ్చారు. కృష్ణా - గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టడానికి తాను సిద్ధమేనని, అక్కడ 40వేల ఎకరాలు లేదా కనీ సం 30 వేల ఎకరాల వైశాల్యం గల భూమి ఒకే చోట ఉంటే అక్కడే పెట్టమనండి అని చెప్పారు. దయచేసి రాజధాని విషయంపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. జగన్ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా,,‘‘రాష్ట్రం 13 జిల్లాలకు కుదించుకుపోయింది. ఇంకా ఇబ్బందులు పడ టం మంచిది కాదు.
 
  దీనిని రాజకీయం చేయాలని చూడటం మంచిది కాదు. మనమంతా కల సి ఉంటే బలంగా, దృఢంగా ఉంటాం. లేకుంటే ఇంకా బలహీనం అయిపోతాం’’ అని చెప్పారు. ‘‘రాజధానిని అడ్డుకోవడానికి మేము ప్రయత్నించడంలేదు. రాజధానిని పెట్టండి అనే మేమే కోరుతున్నాం. రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అసెం బ్లీకి వచ్చి దానిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ఆ నివేదికలో ఏముందో తెలియకుండా, తెలుసుకోవాలనే బుద్ధీ లేకుండా రాజధాని ఎక్కడుండాలో ప్రకటన చేయడానికి ముహూర్తం కూడా నిర్ణయించేసుకుంటున్నారు’’ అని జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజధాని ఎక్కడో ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కదా అని ఓ విలకరి అనగా.. రాజధాని ఎక్కడ నిర్మించేదీ అసెంబ్లీలో గురువారం మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రకటిస్తారని, ఇందుకోసం ముహూర్తం నిర్ణయించిన సిద్ధాంతి పేరుతో సహా చంద్రబాబు అనుకూల పత్రిక ఒకటి ప్రచురించిన వార్తను జగన్ ఉదహరించారు. ఒకసారి ఆ వార్త చదవండి అని అన్నారు.
 
 రామారావుపై కేసు ఎత్తివేయడమేంటి?
 చర్చకు అనుమతించాలని జగన్ డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై నమోదైన కేసును ప్రభుత్వం ఉపసంహరించడాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇది చాలా ముఖ్యమైన విషయమైనందున సభలో చర్చించేందుకు సమయం కేటాయించాలని స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రశ్నోత్తరాల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ.. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే రామారావుపై నిర్భయ చట్టం కింద కేసులతో పాటు పలు అత్యాచారం కేసులున్నాయని, అయితే వాటిని ఈ ప్రభుత్వం తొలగించిందని సభ దృష్టికి తెచ్చారు.
 
ఈ రకంగా కేసును ఉపసంహరించడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. దానిపై చర్చ జరగాలని అంటుండగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభ్యంతరం తెలిపారు. జగన్ బదులిస్తూ ఆయనపై కేసు రద్దు విషయం పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. కేసు ప్రా ధాన్యత దృష్ట్యా చ ర్చకు తగిన సమయం కేటాయించాలని కోరారు. ఇలావుండగా.. ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై అసెంబ్లీలో చర్చించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో పార్టీ సభ్యుడు కె.శ్రీని వాసులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించా రు. అయితే స్పీకర్ దీన్ని తిరస్కరించారు. వేలా ది మంది జీవితాలతో ముడిపడిన అంశాన్ని చర్చించకపోతే ఎలా? అని వైసీపీ సభ్యులు స్పీకర్‌ను అడిగారు. ప్రతిపక్ష నేత జగన్ జోక్యం చేసుకుని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు పై చర్చించేందుకు ఏదో విధంగా సమయం ఇవ్వాలని కోరారు.
 
 ‘వారేం చేసినా బాబు కాపాడేలా ఉన్నారు’

 టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి నేరం చేసినా కాపాడేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు రక్షణనిధి, విశ్వేశ్వరరెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. 2009 సెప్టెంబర్ 1న కొవ్వూరులోని తన న ర్సింగ్ కళాశాలలో కేరళ విద్యార్థినుల్ని లైంగి కంగా వేధించి, అత్యాచార ప్రయత్నాలకు ఒడిగట్టిన టీడీపీ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసులు నమోదయ్యూయని, సీఐడీ విచారణలో నేర నిర్ధారణ సైతం జరిగిందని చెప్పారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుంటే, వాదనలను ఉప సహరించుకోవాల్సిం దిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ జీవో జారీ చేయడం అన్యాయమన్నారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా జీవో ఇప్పించిన చంద్రబాబు సీఎంగా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పిస్తుందో ఈ చర్య ద్వారా తేటతెల్లమౌతోందని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement