- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి
పాతగుంటూరు: రాజధాని నిర్మాణానికి ఇంత హడావుడిగా శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, విభజన చట్టం చెబుతుండగా, దాని ఆధారంగానే చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో తన సొంతింటికి మొన్నే శంకుస్థాపన చేశారన్నారు. రాజధానికి సంబంధించి ఇంతవరకు మాస్టర్ ప్లాన్ తయారు చేయలేదని, ఏ ప్లాన్ లేకుండా శంకుస్థాపన చేస్తున్నారంటే, ఇది కేవలం కంపెనీల కోసం చేస్తున్న శంకుస్థాపన అని అర్ధమవుతోందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు లొంగి భూములు ఇచ్చిన రైతులు సైతం ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తుండంతో ప్రభుత్వం భయపడి హడావుడిగా శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ల్యాండ్‌పూలింగ్‌కు అంగీకరించని రైతులపై భూసేకరణ అస్త్రం ప్రయోగిస్తామని ఏనాడో సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రకటించారన్నారు.
కోర్టులో ఓ పక్కన ఈ అంశంపై పిటీషన్లు ఉన్నాయని, వాదనలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతు కూలీలు, కౌలు రైతులు, ఇతర గ్రామీణ వృత్తిదారులు పనుల కోసం సింగపూర్, జపాన్, చైనాలకు వలస పోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాది మంది రైతులు రుణమాఫీ కాలేదంటూ క్యూ కడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల కొద్ది ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు 3.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారన్నారు. టూరిజం పేరు మీద ప్రభుత్వ భూముల్ని, భూసేకరణ ద్వారా ప్రైవేటు భూములను తమకు కావాల్సిన వ్యక్తులకు సంతర్పణచేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. వీటిన్నింటిపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
డీఎడ్ ప్రవేశపరీక్ష నిర్వహించకపోవడం అన్యాయం
చిలకలూరిపేటటౌన్: డీఎడ్ ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డీ ఎడ్ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు గురువారం పట్టణంలోని మర్రి నివాసానికి వచ్చి సమస్యలు వివరించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై వత్తడి తెచ్చి ప్రవేశ పరీక్ష నిర్వహించేలా కృషిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీటీసీ ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ జారీ చేశారని, జూన్ 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడదల చేయలేదని వివరించారు. కేవలం ఇంజనీరింగ్ కళాశాలల భర్తీ చేసుకోవడం కోసం డీఎడ్ ప్రవేశ పరీక్ష నిర్వహించకపోవడం అన్యాయమన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై తమ పార్టీ తరఫున పోరాడతామని, న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయం పరిశీలిస్తామని హామి ఇచ్చారు.
ఎందుకీ హడావుడి శంకుస్థాపన..?
Published Fri, May 15 2015 4:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement