
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కుంభకోణంపై సిట్ దర్యాప్తు జరుగుతుండగా హైకోర్టు దానిపై విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చిందన్నారు. అంతేకాకుండా సదరు వ్యవహారం మీడియాలో రాకుండా ‘నిషేధిత’ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఓ న్యాయమూర్తి కుటుంబీకులు ఇందులో ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు ఒకేలా ఉండాలన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో బుధవారం ఈ అంశంపై మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
► ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని ఏర్పాటులో నాలుగు వేల ఎకరాల భారీ భూకుంభకోణం జరిగింది. ఆ భూముల విలువ రూ.లక్షల నుంచి ఇప్పుడు రూ.కోట్లకు చేరింది.
► అప్పటి సీఎం రాజధాని తిరువూరులో, ఇతర ప్రాంతాల్లో వస్తుందని అధికారికంగా ప్రకటించి.. తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేశారు. ఇది అధికారిక రహస్యాల్ని స్వప్రయోజనాలకు వాడుకోవడమే.
► ఇదొక భారీ కుంభకోణం. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వాళ్లు, తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లు కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొన్నారంటేనే వాళ్లు బినామీలని అర్థమవుతోంది.
► దేశం చూసిన అతిపెద్ద స్కాముల్లో ఇదొకటి. అందువల్ల సీబీఐ దర్యాప్తు జరపాలని ఇప్పటికే మా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
► అలాగే ఫైబర్‌గ్రిడ్ నెట్‌వర్క్‌లో కూడా రూ.2 వేల కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయి. దీనిపైనా, అంతర్వేది రథం దగ్ధం ఘటనపైన కూడా దర్యాప్తు జరపాలి.