కేసు..తీర్పు.. సంచలనం | case judgment | Sakshi
Sakshi News home page

కేసు..తీర్పు.. సంచలనం

Published Thu, Dec 11 2014 2:52 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

case judgment

జిల్లాలో సంచలనం రేపిన టీడీపీ నాయకుడు, దేవనకొండ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో నిందితులు 17 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆదోని రెండవ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్యం బుధవారం తీర్పు వెలువరించారు. 2008 మే 17న కప్పట్రాళ్ల వెంకటప్ప నాయడు సహా 10 మంది దేవనకొండ మండలం మాచాపురం బస్సు స్టేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. 48 మందిపై కేసు నమోదైంది. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ సాగింది. 26 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
 
 తీర్పు నేపథ్యంలో ఆదోని కోర్టు ఆవరణలో భారీగా పోలీసులను మోహరించడంతోపాటు కప్పట్రాళ్ల గ్రామానికి అదనపు బలగాలను తరలించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదోని కోర్టుకు స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. రెండు ప్రధాన వర్గాల మధ్య చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన తీర్పు దృష్ట్యా శాంతిభద్రతలు అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీతో పాటు ఆదోని డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 100 మంది పోలీసు, సాయుధ బలగాలు బందోబస్తు నిర్వహించారు.
 
 మిన్నంటిన రోదనలు : తమ కుటుంబ సభ్యులు జీవిత ఖైదు పడి జైలుకు వెళ్తుండడంతో బంధువుల రోదనలు ఆదోని కోర్టు ఆవరణలో మిన్నంటాయి. మమ్ములను విడిచి వెళ్లిపోతున్నారు.. ఇక మాకింకెవరు దిక్కంటూ గుండెలు పగిలేలా రోదించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కోర్టు బయట ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కోర్టు ఆవరణలోకి విలపిస్తూ వచ్చారు. వారిని పోలీసులు అదుపు చేయడంతో రోడ్డుపైనే బైఠాయించారు. తమ తండ్రులు జైలు కెళ్తున్నారని తెలుసుకొని చిన్నారులు గుక్కపట్టి ఏడ్చారు. తమ వాళ్లు ఏ అన్యాయం చేయలేదని, అన్యాయంగా శిక్ష విధించారని తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొంతమంది మహిళలు రోదిస్తూ సృ్పహ తప్పి పడిపోయారు. ముద్దాయిలను సబ్‌జైలుకు తీసుకెళ్లే వరకు కుటుంబ సభ్యులను దూరంగా ఉంచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement