
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై నిరాధారమైన తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా ఇక చర్యలు తప్పవు. సర్కారుపై బురదజల్లడమే లక్ష్యంగా అసత్య, నిరాధార వార్తలను ప్రసారం చేసిన, ప్రచురించిన ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలపై కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దురుద్దేశ పూర్వకంగా ప్రభుత్వానికి లేనివి ఆపాదిస్తూ అసత్య ప్రచారం చేసే సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్‌కు అధికారాలు కల్పిస్తూ 2007 ఫిబ్రవరి 20న సాధారణ పరిపాలన శాఖ జీఓఆర్టీ నెంబరు 938 జారీ చేసిన విషయం విదితమే. దీని ప్రకారం ప్రభుత్వానికి చెడ్డపేరు ఆపాదించడమే లక్ష్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తే స్పందించి ఖండనలు ఇవ్వడంతోపాటు ఆయా సంస్థలు, ఎడిటర్లపై న్యాయపరమైన చర్యల కోసం కేసులు నమోదు చేయాలని తాజాగా ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/ కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది.
సర్కారు ప్రతిష్టను మంట గలిపే కుట్ర నేపథ్యంలో...
సర్కారు ప్రతిష్టను మంటగలపాలని, ప్రజల్లో చెడ్డపేరు తేవాలనే దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు కుట్రపూరితంగా పెద్దఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భారీ వర్షాలవల్ల ప్రధానమైన నదుల్లో వరదనీరు ప్రవహిస్తున్నందున ఇసుక రీచ్‌లన్నీ నీటిలో మునిగిపోవడంవల్ల ఇసుక కొరత ఏర్పడితే ఆ విషయం ప్రస్తావించకుండా విపక్షాల ప్రేరేపణతో కొన్ని వార్తా సంస్థలు సర్కారు ప్రతిష్టను మంట గలపాలనే కుట్రతో అసత్య ప్రచారం సాగిస్తున్నాయి.
ఈ తరహా సర్కారుకు మచ్చ తెచ్చే, పరువు నష్టం కలిగించే వార్తలు ఏ శాఖపై వచ్చినా తక్షణమే ఆశాఖ కార్యదర్శి స్పందించి పూర్తి సమాచారంతో ఖండనలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఖండన వార్తలను ప్రధానంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది.