నగదుకు టీచర్ల బదిలీ! | cash for teacher transfers in andhra pradesh | Sakshi
Sakshi News home page

నగదుకు టీచర్ల బదిలీ!

Published Sat, Dec 28 2013 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

cash for teacher transfers in andhra pradesh

* సీఎంఓలో పైరవీల జోరు!
* పరీక్షల ముందు... నిబంధనలకు విరుద్ధంగా...
* గత నెలలో వంద, తాజాగా మరో 366 మందికి ఆర్డర్లు?.. ఫైళ్లపై నేడో రేపో సీఎం సంతకం
* చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికం
 
సాక్షి, హైదరాబాద్: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి పైరవీల చెద పట్టింది.దొడ్డిదారిన బదిలీలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెరతీశారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఇప్పుడు టీచర్ల బదిలీల్లో పైరవీలకే ఆయన మొగ్గుచూపుతున్నారు. పరీక్షల ముందు బదిలీలు చేయడం నిబంధనలకు పూర్తి విరుద్ధమైనా అవేవీ పట్టించుకునే స్థితిలో ఆయన లేరు. పైరవీకారుల ఒత్తిడికి ముఖ్యమంత్రి లొంగిపోయారని  సచివాలయ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి.

ఒక్కొక్క బదిలీ వెనుక రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పైరవీకారులు వసూలు చేసినట్టు సమాచారం. దొడ్డిదారిన బదిలీలకు సంబంధించిన ఫైళ్లు  అడ్డగోలుగా సిద్దమయ్యాయి. గత నెలలో కూడా  ఇదేరకంగా వందమంది టీచర్లను బదిలీ చేశారు. ఇప్పుడు మరో 366 మంది టీచర్ల బదిలీలకు ఫైళ్లు సిద్ధమై ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. నేడో రేపో ముఖ్యమంత్రి సంతకాలు చేస్తారని, ఇందులో జాప్యం జరగదని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ బదిలీల్లో  సింహభాగం ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు, ఆర్థిక మంత్రి సొంత జిల్లా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విద్యా మంత్రి సొంత జిల్లా కృష్ణాల్లోనే ఉండడం గమనార్హం.

ఈ బదిలీలకు ఫైళ్లు తయారీ కూడా ఒక పద్ధతి లేకుండా కేవలం కాగితంపై దరఖాస్తు చేసుకుంటేనే జరిగిపోతున్నాయి.అసలు విద్యా సంవత్సరం మధ్యలో టీచర్ల బదిలీలకు గతంలో ఏ ముఖ్యమంత్రులు అంగీకరించలేదు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో ఒకటో రెండో తప్ప ఇంత పెద్దఎత్తున బదిలీలు అనుమతించలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా పాఠశాల వేసవి సెలవుల్లో బదిలీలపై నిషేధం సడలించిన సమయంలో కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే టీచర్ల బదిలీలను చేపడతారు.

ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా మరో మూడు నెలల్లో పరీక్షలుండగా, పైరవీ కారులు అడిగిందే తడవుగా బదిలీలకు సీఎం, మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బదిలీకి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత జిల్లా విద్యా అధికారి నుంచి అక్కడ ఖాళీ ఉందా లేదా అనే రిమార్క్‌ను కోరతారు. అందుకు అనుగుణంగా విద్యా శాఖ డెరైక్టరేట్ నుంచి ఫైలు తయారై విద్యా శాఖ కార్యదర్శికి వస్తుంది.

అక్కడి నుంచి విద్యా శాఖ మంత్రికి ఆ తరువాత ఆర్థిక కార్యదర్శి, అనంతరం ఆర్థిక మంత్రి, ఆఖరుగా ముఖ్యమంత్రికి ఫైలు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు సిద్ధమైన 366 టీచర్ల బదిలీలకు ఇలాంటి నిబంధనలేమీ పాటించకుండానే సీఎం, మంత్రుల ఫేషీల్లో బదిలీల జాబితాలను సిద్ధం చేసి, విద్యా, ఆర్థిక మంత్రుల ఆమోదంతో ముఖమంత్రి ఆమోదానికి ఫైళ్లు పంపించేశారు. ఈ తంతు చూసి  సచివాలయ అధికారులు విస్మయ్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement