ఏపీకి ప్రత్యామ్నాయ పార్టీల అవసరముంది
తిరుపతిలో మీడియా సమావేశంలో టీటీడీ
పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ
తిరుపతి సిటీ : రాజకీయ వ్యవస్థపైన ప్రజలకు రోజు రోజుకు నమ్మకం సన్నగిల్లుతోందని, రాజకీయ పార్టీలు కులసంఘాలుగా మారుతున్నాయని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ అన్నారు. తిరుపతిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లు అవుతున్నా ప్రజలు దౌర్భాగ్య పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంటే మన రాష్ట్రం దిగజారిపోతోందన్నారు. ప్రజాకర్షణ పథకాలు, పెట్టుబడులు మన రాష్ట్రానికి కావాలని.. అయితే వీటిని మరచిన అధికారపార్టీ నాయకులు ‘ఆకర్ష్’ పనిలో ఉన్నారని తెలిపారు. అధికారపార్టీపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కల్లబొల్లి మాటలు, మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు ప్రజల్ని మోసగిస్తూనే ఉంటారని తెలిపారు. కాపులకు రిజర్వేషన్ల కల్పనలో ఆయనకు చిత్తశుద్ధి లేదని ఓవీ రమణ ఆరోపించారు.
కాగా, అధికార, ప్రతిపక్షపార్టీలు రెండింటిలోను అసంతృప్తివాదులున్నారని చెప్పారు. అన్ని పార్టీల్లో ఉండే అసంతృప్తివాదులను తాము క లిశామని, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించామని చెప్పారు. రాజకీయాల్లో ప్రక్షాళన తీసుకురావటం అవసరమన్నారు. అందరు నాయకులతో చర్చించి కొత్త పార్టీకి రూపకల్పన చేస్తామని, అందుకు తిరుపతి నుంచి నాంది పలుకుతామని పేర్కొన్నారు. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని, ప్రత్యామ్నాయ పార్టీల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అందుకు రాష్ట్రంలోని మేధావులు, ప్రజల సలహాలు, సూచనలు అవసరమని తెలిపారు.